"ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి..!" సింగర్ సుశీల ఫైర్

by Muthe.Rajitha |

స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి హఠాన్మరణంపై మరో లెజెండరీ సింగర్ పి.సుశీల వ్యక్తంచేసిన తీవ్ర ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి..! సింగర్ సుశీల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : సంగీత ప్రపంచంలో అగ్రగాములుగా వెలిగిన స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి హఠాన్మరణం సినీ, సంగీత లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపై మరో లెజెండరీ సింగర్ పి.సుశీల వ్యక్తంచేసిన తీవ్ర ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. దశాబ్దాల పాటు ఒకరికొకరు సమకాలీనులుగా, పోటీదారులుగా ఉంటూనే తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ఈ సందర్భంగా సుశీల గుర్తుచేసుకున్నారు. జానకమ్మను ఒక పర్వతంతో పోల్చిన ఆమె, జానకి లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని, సరస్వతీ దేవి తన పరలోక కచేరి కోసమే జానకమ్మను ఇక్కడి నుండి తీసుకువెళ్లిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన మైత్రిని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా తమ కెరీర్ రోజుల్లో కొందరు వ్యక్తులు చేసిన కుట్రలను, ఎదుర్కొన్న మానసిక ఇబ్బందులను సుశీల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "గతంలో కొంతమంది వ్యక్తులు మా ఇద్దరి మధ్య లేనిపోని తగాదాలు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, నా గురించి జానకికి, జానకి గురించి నాకు లేనిపోని అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మానసికంగా ఏడిపించుకు తిన్నారని" ఆమె మండిపడ్డారు. ఆనాడు తమ మధ్య దూరాన్ని పెంచాలని చూసిన ఆ స్వార్థపరులందరి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయంటూ ఘాటుగా విమర్శించారు. అయితే జానకి లాంటి మహోన్నత గాయని వాయిస్‌ను వినే భాగ్యం కలిగిందంటే ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని, జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటల రూపంలో ఆమెకు ఎప్పటికీ మరణం ఉండదని సుశీల కొనియాడారు.

Next Story