- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ రికార్డుల డిజిటలైజేషన్‌తో పెరిగిన అవినీతి దందా..?
డిజిటలైజేషన్‌తో తారాస్థాయికి చేరిన రెవెన్యూ అవినీతి.. భూ భారతి చట్టం ప్రకారం ఏటా మాన్యువల్ రికార్డుల ప్రింట్ కాపీలను ప్రజల ముందుంచాలని డిమాండ్!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని భూములు ఆన్‌లైన్‌లో రికార్డుకు ముందు, ఆ తర్వాత అవినీతి పెరిగిందా? తగ్గిందా? అనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల మధ్య చాలా తేడా ఉంది. ఇక్కడి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. ఇక్కడ ఉన్నన్ని రకాల భూములు మరెక్కడా లేవు. పైగా పట్టాలు, అసైన్డ్ ల్యాండ్స్ కూడా అనేకం ఉన్నాయి. అంతకుమించిన వివాదాలు చుట్టుముట్టాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా డిజిటలైజేషన్ పద్ధతినే అనుసరిస్తామంటే కుదిరేటట్టు కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ అధ్యయనం ప్రకారం డిజిటలైజేషన్ కేవలం ఒక టూల్‌గా ఉపయోగించుకోవాలి.
మాన్యువల్ రికార్డ్ మెయింటెయిన్ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. పైగా డిజిటలైజేషన్ ఫైనల్ అనుకుంటే పొరపాటే. అందుకే ఇప్పుడు రెవెన్యూ శాఖలో అవినీతి ఎప్పటి నుంచి పెరిగిందన్న చర్చ నడుస్తోంది. ఆన్ లైన్(డిజిటలైజేషన్) ముందు, తర్వాత ఏ విధంగా ఉంది? అప్పుడు ఎక్కువగా పొరపాట్లు చోటు చేసుకున్నాయా? ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా? జనం ఎప్పటి నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు? కేసీఆర్ హయాంలో చోటు చేసుకున్న భూ రికార్డుల ప్రక్షాళన దుర్వినియోగమైంది. మాన్యువల్‌గా రికార్డులు నిర్వహించినప్పటి కంటే ఇప్పుడే అవినీతి తారాస్థాయికి చేరిందనేది అంగీకరించాల్సిందే.
ఏండ్లు తిరిగినా సాల్వ్ కాదు..
అప్పుడు నెలలో అయ్యే పని.. ఇప్పుడు ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినా కావడం లేదు. పైగా టెక్నికల్ ఇష్యూస్, అధికారాల కేంద్రీకరణ.. అన్నింటికీ మించి గ్రామం నుంచి హైదరాబాద్ దాకా తిరగాల్సిందే. అందుకే ‘భూ భారతి, ధరణి పోర్టల్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కంప్యూటర్ రికార్డులు వద్దు, మాన్యువల్ రికార్డే ముద్దు అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న కంప్యూటర్ రికార్డులతో పాటు సంవత్సరానికి ఒకసారి ఆ రికార్డుని ప్రింట్ తీసి పెట్టమని. ఏడాదికి ఒక్కసారి మాన్యువల్ కాపీని రైతులకు ఇవ్వమని’ అని భూ భారతి చట్టం రూపకర్త భూమి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాదికోసారి ఏది?
సంవత్సరానికి ఒక్కసారైనా ప్రింట్ రికార్డు(మాన్యువల్)ను ప్రజల ముందు ఉండడం లేదు. ప్రతి గ్రామంలో ప్రింట్ తీసి రైతులు పరిశీలించు కోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? ఇది భూ భారతి చట్టంలోనే ఉన్న అంశం. దాన్ని రెవెన్యూ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు? ధరణి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కూడా గ్రామాల్లో రికార్డు ఉండాలన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాన్యువల్ రికార్డును జనం ముందు ఉంచడం ద్వారా కలిగే ప్రయోజనాలను మరిచాయి. 1994 వరకు ప్రతి ఏటా జమాబందీ జరిగేది. గత ఏడాది, ఇప్పటి భూముల లెక్క సరిపోయిందా? లేదా? ఎవరి భూమి, ఎవరి పేరిట మారుతుంది? దీన్ని సరి చూసుకోవడం వల్ల ప్యూరిఫైడ్ ఆర్వోఆర్ రూపొందేది.
ఎప్పుడైతే డిజిటలైజేషన్ ప్రాధమ్యాలుగా మారాయో, అప్పటి నుంచి మాన్యువల్ రికార్డు అనేదే లేకుండా పోయింది. ప్రతి రెవెన్యూ 1బి రికార్డు గ్రామం, మండలం, డివిజన్, జిల్లా, సీసీఎల్ఏ కేంద్రాల్లో ఉండాలన్నది ఇలాంటి ట్యాంపరింగ్ జరగకుండా ఉండేందుకే. ఇదంతా గుర్తించిన తర్వాత భూభారతి చట్టంలో ప్రతి ఏటా ప్రింట్ కాపీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అది కూడా అమలు చేయడంలో అధికారులు ఫెయిలయ్యారు.
బండారం బయటపడుతుందనే..
ప్రతి ఏడాదిలో ఒకసారి రెవెన్యూ రికార్డును ప్రజల ముందు ఉంచితే ఎక్కడ తాము చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతాయోనని అధికారులు భయపడుతున్నారు. అందుకే జీపీవో నుంచి సీసీఎల్ఏ వరకు మాన్యువల్ రికార్డును భూ హక్కుదారుల ముందు ఉంచేందుకు ససేమిరా అంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి భూమి ఎవరు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? అనేది జనానికి అర్ధమవుతుంది. ఇదేం దాచి పెట్టే విషయం కానప్పుడు కొనుగోలుదారుల కంటే ఎక్కువగా అధికారులే గోప్యతను పాటిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా డిజిటలైజేషన్‌పైనే ఆధారపడడం ద్వారా సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకొని ఏకపక్షంగా భూములను రాసుకునే దాకా వచ్చింది.
అవినీతిని తగ్గించడానికి ఈ డిజిటలైజేషన్ ఎంత ఉపయోగపడుతుందో తెలియదు. కానీ మాన్యువల్‌గా అప్లికేషన్ తీసుకోవడం అనివార్యమని, లక్షలాది మంది బాధితులకు న్యాయం చేయాలంటే ఇదొక్కటే సరైన మార్గంగా కనిపిస్తుందంటున్నారు. సెక్రెటేరియేట్‌లో కూర్చొని రివ్యూ చేసే వారికి డిజిటలైజేషన్‌లో తెలంగాణ ముందు వరుసలో ఉందని, ఇప్పుడు వెనక్కి వెళ్తామనే ఐఏఎస్ అధికారులు సమీక్షించుకోవాలి. అవినీతి, అక్రమాలు లేని భూ పరిపాలనకు మెరుగైన చర్యలు తీసుకోవాలి.
అప్పుడూ ఇప్పుడూ తప్పులే..
ధరణి అమలైనప్పుడు చాలా వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ప్రతి ఊరిలో వంద మందికి పైగా రైతులకు సంబంధించిన భూమి వివరాలు సరిగా నమోదు చేయలేదు. 45 రకాల సమస్యలు ఏర్పడ్డాయి. సమస్యల పరిష్కారం క్లిష్టంగా, రైతులకు భారంగా మారింది. భూ భారతిలో ఆ రికార్డును సరి చేయకుండానే మొదలు పెట్టారు. అవే తప్పులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ధరణి, భూ భారతిలో డేటా కరెక్షన్ కోసం కూడా లక్షల్లో అప్లికేషన్లు దాఖలయ్యాయి. భూ రికార్డుల సమస్యలు తీరాలంటే భూముల రీ సర్వే చేయాలి. అంతకు ముందే కొత్త రికార్డులను రూపొందించుకోవడం సమస్యకు సమగ్ర, శాశ్వత పరిష్కారం. ఈ లోపు ప్రజల భాగస్వామ్యంతో భూ భారతిలో ఉన్న తప్పులను గుర్తించాలి. గ్రామాల్లో సదస్సులు/కోర్టులు నిర్వహించి రికార్డులను సరిచేయాలి.
ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించి రికార్డుల్లో తప్పులుంటే సరి చేయాలి. భూ భారతిలో భూముల రికార్డులతో కూడిన ‘భూమి రికార్డుల కిట్’ను ప్రతి రైతుకూ అందించాలి. కంప్యూటర్ రికార్డు భూ యజమానికి తెలియకుండా ఎలాంటి మార్పు జరిగే వీలులేని విధంగా రూపొందించాలి. కాగితాల్లో ఉన్నా, కంప్యూటర్‌లో ఉన్నా అవి కేవలం రికార్డులు మాత్రమే. ఈ రికార్డులను వినియోగించుకునే దాన్ని బట్టే సమస్యల పరిష్కారం, హక్కుల రక్షణ ఉంటుంది. రికార్డుల కంప్యూటరీకరణ తో పాటు చట్టాల్లో మార్పులు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ, మెరుగైన భూపరిపాలనకు యంత్రాంగం ఏర్పాటు జరగాలి.
డిజిటలైజేషన్‌తోనే అవినీతి దందా?
2017 నుంచి భూ పరిపాలన డిజిటలైజేషన్ వైపు పూర్తిగా మారింది. అప్పటి నుంచే అవినీతి దందా? మొదలైంది. భూముల ధరలు పెరిగిన తర్వాత రికార్డులను మార్చే దాకా చేరింది. మాన్యువల్ గా రికార్డులు ఉన్నప్పుడు గ్రామ స్థాయిలోనే అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత లంచాలు లేకుండా పని అవుతుందని, చట్టం ప్రకారం నిర్దిష్ట సమయంలోనే పని చేస్తున్నారని చెప్పే వారి సంఖ్య ఒక్క శాతం కూడా లేదు. అందుకే ఏ అధికారి ఏసీబీకి చిక్కినా, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని విచారించినా రూ.వందల కోట్లు ఆస్తులు బయటపడుతున్నాయి.
వీరిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ఎక్కువ. అందుకే భూ భారతి చట్టంలోని ప్రతి అంశాన్ని వెంటనే అమలు చేయాలి. కొన్నింటికి మాత్రమే రూల్స్ జారీ చేశారు. చాలా అంశాలను మరుగున పెట్టారు. అప్పీల్ వ్యవస్థ, ట్రిబ్యునల్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ వంటివి ఆచరణలో పెట్టలేదు. అలాగే ప్రతి ఏడాది జమాబందీ నిర్వహించి రికార్డుల్లో తప్పులుంటే సరి చేయాలని, కనీసం రికార్డును జనం ముందు ఉంచాలని చట్టంలోనే ఉంది. కానీ, అధికారులు మాత్రం దానికి ససేమిరా అంటున్నారు.






