- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు.. పాలమూరుపై 'హస్తం' పట్టు!
ఉమ్మడి పాలమూరు జిల్లాపై అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పట్టు సడలకుండా ఉండేందుకు వీలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాపై అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పట్టు సడలకుండా ఉండేందుకు వీలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇటు అభివృద్ధి, అటు సంక్షేమ కార్యక్రమాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశాలు లేకుండా చేసేందుకు అధికార పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం దొరికింది. వడ్డించే స్థానంలో నేను ఉన్నాను. ఇప్పుడు నా జిల్లాను అభివృద్ధి చేసుకోకుంటే ఇంకెప్పుడూ చేసుకోము.. మంత్రులందరూ కూడా ఈ జిల్లాకు నిధులను పెద్ద మొత్తంలో కేటాయించాలని విజ్ఞప్తి చేసిన విషయం పాఠకులకు విధితమే.
బీఆర్ఎస్ ఒక్క అడుగు వేస్తే.. పది అడుగులు వేస్తున్న అధికార పార్టీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ నేతలు ఒక్క అడుగు ముందుకు వేస్తే అధికార పార్టీ నేతలు పది అడుగులు ముందుకు వేస్తూ ఆ పార్టీ కార్యక్రమాలు ప్రజలు చర్చించకుండా మంత్రుల పర్యటనలు, కార్యక్రమాలతో జిల్లాలో పర్యటిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రెండు రోజులపాటు ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించి వాటి పూర్తి కోసం అయ్యే ఖర్చులు, తదితర వివరాలను సేకరించి బీఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేపట్టాలనుకున్న పాదయాత్రలు, ప్రాజెక్టుల సందర్శనలు వాయిదా పడిపోయాయి. తుంగభద్ర, కృష్ణా నదులపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమ నిర్మాణాలు చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు , తాగునీరు అందకుండా చేస్తున్నారని, వీటిని అడ్డుకోకుంటే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారడం ఖాయం అని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్డీఎస్ సందర్శించి ఉమ్మడి జిల్లా రైతాంగం, ప్రజానికం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయగా అదే రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకంగా నలుగురు మంత్రుల పర్యటనలు చేసి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటింపజేసి బి ఆర్ ఎస్ నేతలు, మాజీ మంత్రుల ప్రయత్నాలు ప్రజల్లోకి వెళ్లకుండా సక్సెస్ అయ్యారు.
వరుసగా మంత్రుల పర్యటనలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుసగా మంత్రుల పర్యటనల కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి పాల్గొని జిల్లాలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
త్వరలోనే మరికొందరు మంత్రుల రాక..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో త్వరలోనే మరికొందరు మంత్రులు పర్యటించనున్నట్లు సమాచారం. వారం పది రోజులలో రాష్ట్రమంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి..
బీఆర్ఎస్ , బీజేపీలపై విమర్శలు ఎక్కువగా చేయడం కన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సడలకుండా ఉండవచ్చు అన్న ఆలోచనలతో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఒకవైపు ప్రతి ఏటా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 20వేల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంతోపాటు ప్రతిపక్షాలు నిలదొక్కుకోకుండా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ ముఖ్య నేతలు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంపై సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు సడలకుండా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు బీఆర్ఎస్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి..!






