ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతన్నలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-13 04:34:53  IST  )

వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతన్నలు
X

రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో హుషారుగా నారుమడులను పోసుకున్నారు. ఈ మధ్య కాలంలో అడపాదడపా వర్షం కురుస్తూ ఎండలు మండుతుంటే బోరు బావుల్లో నీరు లేక వేసిన వరి నాట్లు కోలుకోలేక కొందరు రైతులు బోరున విలపిస్తున్నారు. మరికొందరు తమ నారుమడులు ముదిరిపోతున్నా నాట్లు వేయలేక పోతున్నారు. వర్షాలు కురవాలని వరుణుడి కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో గంగాజలాలతో నిత్యం గ్రామదేవతలకు జలాభిషేకం చేస్తున్నారు. ఆలయాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నీరంద కపోవడంతో ఎండిన పంటను చూసి పలువురు కన్నీరు పెడుతున్నారు. పంటను వదులుకోలేక పలు గ్రామాలకు చెందిన రైతలు పంటలకు నీటిని కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. కానీ అది సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు నీరందించలేక ఆశలు వదులుకున్నారు. మరి కొంద రు రైతులు సాగు చేసిన పంటలు కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారు.

దిశ, మద్నూర్: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత 15 రోజులుగా వర్షం లేకపోవడంతో పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ఇంకా విత్తనాలు వేయలేదు. కొందరు ధైర్యం చేసి విత్తినా పంట పలచగా మొలకెత్తి, తగినంత తేమ లేక మొలకెత్తిన పంట ఎండ వేడికి వాడిపోతోంది. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు.

బోర్లు ఉన్నవారు పంట కాపాడుకునే ప్రయత్నం..

బోరు సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్లు, రైన్ పైపులతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్షంపైనే ఆధారపడే అధిక శాతం రైతులు మాత్రం ఆకాశం వైపు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.

అప్పుల భారంతో ఆందోళన..

విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. వర్షం లేక పంట చేతికి రాకపోతే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అప్పుల్లోనే మునిగిపోతామేమోనన్న ఆందోళన రైతుల్లో మొదలైంది.

దేవుళ్లకు మొక్కులు..

కొన్ని గ్రామాల్లో రైతులు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్షం కోసం పండుగలు జరుపుకుంటున్నారు.

కామారెడ్డి జిల్లా వాతావరణ గణాంకాలు..

ఉష్ణోగ్రతలు: గరిష్టం 32°C నుంచి 35.9°C. మెనూర్‌లో అత్యధికం 35.9°C, రామారెడ్డిలో 35.5°C. కనిష్టం 23°C నుంచి 27.3°C. గా ఆదివారం ఉన్నాయి.

వర్షపాతం: ఈ సీజన్ సంచిత వర్షపాతం 172.8 ఎంఎం. సాధారణం 230.9ఎంఎం. 25.0శాతం కొరత తో "Deficient"గా ఉంది.

మండలాల వారీ స్థితి..

అధికం: భిక్నూర్ +39.0శాతం

సాధారణం: జుక్కల్, బీర్కూర్, నసురుల్లాబాద్, సదాశివనగర్, కామారెడ్డి, రామారెడ్డి, డోమకొండ, పాల్వంచ

కొరత: మద్నూర్, పెద్దకొడ్పగల్, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, నిజాంసాగర్, యెల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, డొంగ్లి, మొహమ్మద్‌నగర్

తీవ్ర కొరత: నాగిరెడ్డిపేట -61.0శాతం

జిల్లాలోని 25 మండలాల్లోనూ కావాల్సినంత వర్షం నమోదు కాలేదు. వర్షాలు ఆలస్యం కావడంతో ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story