2002 ఓటరు లిస్టుతో కొత్త సమస్యలు.. ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో సందిగ్ధం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా ప్రహాసనంగా సాగుతోంది.

2002 ఓటరు లిస్టుతో కొత్త సమస్యలు.. ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో సందిగ్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా ప్రహాసనంగా సాగుతోంది. 2002 ఓటరు జాబితాతోనే కొత్త చిక్కులు వచ్చాయని ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. నాటి ఓటరు లిస్టు ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉండగా.. చాలా మందికి ఓటు హక్కు లేదని తెలుస్తోంది. వివరాలు చూపించకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. నాటి మ్యాపింగ్ ప్రకారం తమ పేరెంట్స్‌కు ఓటు హక్కు ఎక్కడ ఉంది? పోలింగ్ బూత్ ఎక్కడ? ఏ వార్డు? అనేది తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బూత్ లెవల్​ఆఫీసర్స్​(బీఎల్‌ఓల) నిర్లక్ష్యంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇంకా అనేక మంది ఓటర్లుకు ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఎన్నికల సంఘం మాత్రం లెక్కల్లో 99 శాతం ఫారాలు పంపిణీ చేసినట్టుగా చెబుతోంది. ఓటరుగా తమ పేరు జాబితాలో ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు.. తమ బీఎల్‌ఓ పేరు, అడ్రసు, ఫోన్​నెంబర్, ఆయన ఉండే ఇల్లు వంటి వివరాలు తెలుసుకొని మరీ ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుంటున్నారు. పారదర్శకంగా ఫారాల పంపిణీ జరగకపోవడంతో ఓటర్లు ఎన్నికల సంఘం, ఉన్నతాధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు.

2002 ఓటరు జాబితాతో అసలు సమస్య

చాలా మందికి 2002లో తమ ఓటు ఎక్కడుందనేది తెలీదు. ఏ పోలింగ్​బూతులో ఉందో కనుక్కోవడం గగనంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా తెలియని వారి కష్టాలు అంతా ఇంతా కాదు. అప్పుడు వారున్న నియోజకవర్గం, పోలింగ్​బూత్ ఎక్కడో ఉందో తెలియక, గుర్తుచేసుకోలేక నానాఅవస్థలు పడుతున్నారు. కిరాయి ఇళ్లల్లో ఉండేవారు మారుతూనే ఉంటారు. అలాంటి వారికి నాటి ఓటరుజాబితా మ్యాపింగ్ ఇప్పుడు ఎలా తెలుస్తుంది. నాడు ఓటు వేసామో లేదో కూడా కొందరికి గుర్తులేదని చెబుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారు ఒకే దగ్గర ఉండకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిసింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్లు 2002 ఓటరు జాబితాను మ్యాపింగ్​చేయాల్సి ఉంటుంది. ఇది ‘సర్’ ప్రాథమిక నిబంధన. అయితే, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ఓటర్లే తమ పేర్లు చూపించడం లేదని, ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదని, వచ్చినా ఎలా ఫారమ్ ఫిల్ చేయాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నెల 24 డెడ్‌లైన్

ఈ నెల 24తో ఎన్యూమరేషన్​గడువు ముగియనుంది. కానీ ఇంకా ఫారాలే అందకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మాత్రం అంతా సాఫీగా నడుస్తోందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఓటర్లు బీఎల్‌ఓల మీద మండిపడుతుండగా.. మరోవైపు బీఎల్ఓలు ఓటర్లను హెచ్చరిస్తున్నట్టుగా తెలిసింది. ఎన్యూమరేషన్​ ఫారం పూర్తి చేసి ఇస్తేనే ఓటు హక్కు ఉంటుందని, లేదంటే భారత పౌరులు కాకుండా పోతారంటూ హెచ్చరిస్తున్నట్టు తెలిసింది.

కొందరు ఓటర్లు 2002 ఓటరు జాబితాలో తమ పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వడం లేదని సమాచారం. ఇదే విషయాన్ని బీఎల్‌ఓల దృష్టికి తీసుకెళ్తే.. ఫారమ్ ఇవ్వని వారికి ఓటు హక్కు రద్దు అవుతుందని, భారతీయులుగా ఇకపై గుర్తించబోరని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్​లాంటి జిల్లాల్లో ఇంకా అనేక మందికి ఎన్యూమరేషన్​ఫారాలు రాలేదని ఫిర్యాదు వస్తున్నాయి. ఈసీ మాత్రం సమాధానం చెప్పకుండా 99 శాతం ఫారాలు పంపిణీ చేశామని చేతులు దులుపుకుంటోంది.

మైగ్రేషన్ ఎక్కువ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో ప్రాంతాలు మారిన వారే ఎక్కువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మేడ్చల్​జిల్లాలో పరిశీలిస్తే ఇప్పటివరకు 15వేల మంది ఓటర్లు షిప్ట్​ అయినట్టు తెలిసింది. 10 వేల మంది చనిపోయినట్టు లెక్కలు తేల్చారు. వేయి మంది వరకు ఇండ్లల్లో లేరని తేలింది. పట్టణాల్లో ఇళ్లు మారడం, మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లోనే తమ ఓటును కొనసాగించడం తదితర కారణాలతో పట్టణాల్లో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. దానిలో భాగంగానే ఎక్కువ మంది షిఫ్టింగ్ (వలసలు) పోతున్నట్టు గుర్తించారు.

మ్యాపింగ్ లేకపోయినా ఫారమ్స్ నింపొచ్చు!

2002 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికల అధికారులు మ్యాపింగ్​ చేస్తే తమ ఓటు హక్కుపై భరోసా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే, మ్యాపింగ్​లేకపోయినా ఎన్యూమరేషన్​ఫారాన్ని ఇవ్వవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మ్యాపింగ్​కానీ ఓటర్ల వివరాలను మరో జాబితాగా రూపొందించి ప్రచురిస్తామని పేర్కొంటున్నారు. కానీ, వీరు భారతీయులనే విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏదైనా ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలు సరియైనవో కావో ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేసి అప్పుడు వారి ఓటు హక్కును పునరుద్ధరిస్తారు. సరియైన డాక్యుమెంట్స్ సమర్పిచకుంటే ఓటును తొలగించే అవకాశం ఉంటుంది. కాగా, మ్యాపింగ్​చేసుకోవడమే ఉత్తమమని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

Next Story