తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న 7 ఈఎస్ఐసీ ప్రాజెక్టులు

by Malleboina Mahesh |

సనత్‌నగర్ ఈఎస్ఐసీ వేదికగా దేశవ్యాప్తంగా రూ.668 కోట్లతో 7 ఆరోగ్య ప్రాజెక్టులను రేపు ప్రారంభించనున్న కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ!

తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న 7 ఈఎస్ఐసీ ప్రాజెక్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా కార్మిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఊతం ఇవ్వనుంది. నగరంలోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా రూ.668 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను జూలై 14న కేంద్ర కార్మిక-ఉపాధి, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖల మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది ఈఎస్ఐ లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణలోని హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా నిలవనుంది.

ఇక్కడి రూ.211.13 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన నూతన ఓపీడీ విభాగాన్ని కేంద్ర మంత్రి స్వయంగా ప్రారంభించనుండగా, దేశంలోని మిగిలిన 6 ప్రాజెక్టులను ఇక్కడి నుంచే వర్చువల్ విధానంలో దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక-ఉపాధి, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా పాల్గొంటారు. దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మాణ కార్మికులను ఈ వేదికపై మాండవీయ సత్కరించనున్నారు. అలాగే ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను అందజేస్తారు.

తెలంగాణ కార్మికులకు వరం.. సనత్‌నగర్ కొత్త ఓపీడీ

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో 43,611.04 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో ఈ నూతన ఓపీడీ విభాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇందులో జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ, కంటి చికిత్స, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ విభాగాల ఓపీడీ సేవలు ఒకే చోట లభిస్తాయి. దీనితో పాటు ఫిజియోథెరపీ, రేడియాలజీ, యోగా కేంద్రం, 180 సాధారణ పడకలు (మూడు 60 పడకల వార్డులు), 25 ఐసీయూ పడకలు, 20 ఎన్ఐసీయూ పడకలు, మందుల దుకాణం, క్లినికల్ లెక్చర్ థియేటర్లను ఏర్పాటు చేశారు.

ఈ కొత్త విభాగం ద్వారా తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 12,30,183 మంది బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్య సేవలు అందనున్నాయి. కాగా... 1975 మార్చి 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం జంట నగరాల (హైదరాబాద్, సికింద్రాబాద్) పరిధికే పరిమితమై ప్రారంభమైన ఈ ఈఎస్ఐ ఆస్పత్రి, కాలక్రమేణా సేవలని విస్తరించింది. ప్రస్తుతం ఈఎస్ఐసీ 2.0 సంస్కరణల కింద తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీని ద్వారా రాష్ట్రంలో సామాజిక భద్రత కింద మొత్తం 19,15,700 మంది బీమా చందాదారులు, 74,32,916 మంది లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఇతర ప్రాజెక్టుల వివరాలు

రాజమహేంద్రవరం ఈఎస్ఐఎస్ ఆసుపత్రి (ఆంధ్రప్రదేశ్): ఇక్కడ 26 ఓపీడీ గదులు, 3 ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో కూడిన వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల 1,31,190 మంది బీమా చందాదారులతో పాటు మొత్తం 2,52,717 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది.

బెల్తోలా ఈఎస్ఐసీ ఆసుపత్రి (అస్సాం): ఇక్కడి ఆసుపత్రిని 200 పడకల సామర్థ్యానికి ఉన్నతీకరించారు. దీని ద్వారా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలోని 3.42 లక్షల మంది బీమా చందాదారులతో సహా మొత్తం 13.27 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.

శ్రీపెరంబుదూర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి (తమిళనాడు): ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారిన శ్రీపెరంబుదూర్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇక్కడ ఓపీడీ, ఎమర్జెన్సీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ల్యాబ్, ఫార్మసీ సదుపాయాలు ఉంటాయి. దీనివల్ల కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధిలోని 5.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.

సురేంద్రనగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీ (గుజరాత్): ఇక్కడ ఒకే చోట ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య సంప్రదింపులు, మందులు లభిస్తాయి. దీని ద్వారా సుమారు 35,000 మందికి లబ్ధి చేకూరుతుంది.

కోటా ఉద్యోగ నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీ (రాజస్థాన్): ఇక్కడి పారిశ్రామిక ప్రాంత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా 75,000 మంది బీమా చందాదారులు సహా మొత్తం 2,91,000 మందికి సేవలు అందుతాయి.

భవానీ మండి ఈఎస్ఐ డిస్పెన్సరీ (రాజస్థాన్): ప్రముఖ టెక్స్‌టైల్ హబ్ అయిన ఈ ప్రాంతంలోని పారిశ్రామిక కార్మికుల కోసం ఏర్పాటైన ఈ డిస్పెన్సరీ ద్వారా 27,715 మంది చందాదారులు సహా మొత్తం 1.07 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందనున్నాయి.

Next Story