డీప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ దేవాదుల పర్యటన

by Malleboina Mahesh |

దేవాదుల, సీతారామ సాగర్ పనులపై భట్టి, ఉత్తమ్ సమీక్ష.. నార్లాపూర్ పంప్‌హౌస్ మోటార్లను విజయవంతంగా ప్రారంభించిన అధికారులు!

డీప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ దేవాదుల పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు బయలుదేరనున్నారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ దేవాదుల ప్రాజెక్టు ఆఫ్‌టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్‌ను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం దేవాదుల నుంచి బయలుదేరి మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఆఫ్‌టేక్ పాయింట్, నీటి సరఫరా వ్యవస్థ పై క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ పర్యటనలో దేవాదుల, సీతారామ సాగర్ ప్రాజెక్టుల పనుల పురోగతి, నీటి వినియోగం, సాగునీటి అందుబాటు, పెండింగ్ నిర్మాణాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సమీక్ష అనంతరం సీతారామసాగర్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కేంద్ర నిధుల విడుదల, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇతర కీలక నీటిపారుదల అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, కేంద్ర సహకారం అవసరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్

రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక టూర్ షెడ్యూల్‌ను మంత్రి కార్యాలయం విడుదల చేసింది. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్న ఉత్తమ్.. కేంద్ర జలశక్తి కార్యదర్శిని కలువనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి అంశాలపై ఆయన చర్చించనున్నారు. అలాగే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారని సమాచారం.

నార్లాపూర్ పంప్‌హౌస్ మోటార్ల ప్రారంభం

పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్‌ మోటార్లను ఆదివారం రాత్రి మోటార్లను అధికారులు ప్రారంభించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నార్లాపూర్ పంప్ హౌస్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ప్రభుత్వం ట్రాన్స్‌కోకు రూ.160 కోట్ల బకాయిలను విడుదల చేసింది. దీంతో విద్యుత్ సరఫరాకు సంబంధించిన అడ్డంకులు తొలగి, మోటార్ల ప్రారంభానికి మార్గం సుగమమైంది. పది రోజులుగా బీహెచ్ఈఎల్ సాంకేతిక నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులు పంప్ హౌస్‌లో విద్యుత్ వ్యవస్థలు, మోటార్లు, నియంత్రణ పరికరాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు, పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆదివారం రాత్రి మోటార్లను ప్రారంభించారు. మోటార్ల ప్రారంభంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరో కీలక దశలోకి అడుగుపెట్టనున్నాయి.

Next Story