సింగర్ ఎస్. జానకి అంత్యక్రియలు పూర్తి

by Muthe.Rajitha |

సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను ఓలలాడించిన స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి అంత్యక్రియలు ముగిశాయి.

సింగర్ ఎస్. జానకి అంత్యక్రియలు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను ఓలలాడించిన స్వరసామ్రాజ్ఞి ఎస్‌.జానకి అంత్యక్రియలు ముగిశాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల భారతీయ సినీ, సంగీత ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మైసూరు నగరంలో పూర్తిగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జానకి అంత్యక్రియలను అత్యంత గౌరవప్రదంగా నిర్వహించింది. జానకిగారి మనవరాలు అప్సర విద్యుల హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు అంతిమ సంస్కారాలు, అంతిమ క్రియలను నిర్వహించారు.

అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభానికి ముందు, సుదీర్ఘ కాలం పాటు వేల పాటలతో అలరించిన ఈ మహోన్నత గాయనిని కడసారి చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జానకమ్మ పార్థివదేహాన్ని మైసూరులోని ప్రసిద్ధ మహారాజా కళాశాల మైదానానికి తరలించి ప్రజా సందర్శనార్థం ఉంచారు. తమ జీవితాల్లోని ఎన్నో మధుర క్షణాలకు తన పాటల ద్వారా ప్రాణం పోసిన జానకమ్మను చివరిసారిగా దర్శించుకోవడానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ, సంగీత రంగాల ప్రముఖులతో పాటు వేలాది మంది అభిమానులు మైదానానికి తరలివచ్చారు. తమ ప్రియతమ గాయని భౌతికంగా దూరమవడాన్ని తట్టుకోలేక, కన్నీటి పర్యంతమవుతూ బాధాతప్త హృదయాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు.

Next Story