ఆరుగురిని క్రూరంగా చంపిన కిరాతకుడు ఎక్కడ?

by Muthe.Rajitha |

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో కిరాతక నిందితుడు రాజ్ కుమార్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

ఆరుగురిని క్రూరంగా చంపిన కిరాతకుడు ఎక్కడ?
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కిరాతక నిందితుడు రాజ్ కుమార్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కన్నబిడ్డలతో సహా ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన ఈ నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో, అతడిని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. హత్యలు చేసిన అనంతరం నిందితుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పి, ఆ తర్వాత తన మొబైల్ ఫోన్‌ను ఆఫ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి చనిపోవడానికి ప్రయత్నించాడని, అయితే రైలు వేగంగా దగ్గరకు రాగానే భయంతో ఆ చివరి నిమిషంలో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

రైలు ప్రమాద ప్రయత్నం విఫలమయ్యాక నిందితుడు రాజ్ కుమార్ తన ఉనికిని చాటుకోకుండా ఉండేందుకు బెంగళూరు నగరానికి గానీ, లేదా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న శ్రీశైలానికి గానీ పారిపోయి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపి నిఘా ఉంచారు. అయితే మరోవైపు, ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు ఇప్పటికే పోలీసుల రహస్య అదుపులోనే ఉన్నాడని, శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండేందుకే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదంటూ స్థానికంగా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పసివాళ్లను సైతం వదలకుండా ఆరుగురి ప్రాణాలు తీసిన ఈ క్రూరుడు అసలు ఎక్కడున్నాడనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఈ కిరాతకుడిని ఎలాగైనా సరే త్వరగా పట్టుకుని, ఉరిశిక్ష విధించాలంటూ ప్రజల నుండి తీవ్ర ఆగ్రహావేశాలు, డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Next Story