ఎల్ఆర్ఎస్ పై సర్కార్ ఫోకస్.. రాయితీ ఇచ్చినా స్పందన కరువు

by Naga Rani Yarlagadda |

ఆదాయ సమీకరణే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఎల్ఆర్ఎస్ పై సర్కార్ ఫోకస్.. రాయితీ ఇచ్చినా స్పందన కరువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయ సమీకరణే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మరో సారి ఫీజులో 25శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేలా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతోపాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సైతం ఆదేశాలు జారీచేసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పర్యవేక్షించాలని నిర్ణయించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ ఫీజు చెల్లించడానికి దరఖాస్తుదారులు ముందుకురావడంలేదు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని 21.63లక్షల దరఖాస్తులకు ఇంటిమేషన్ ఇచ్చింది. కానీ 7.20లక్షల మంది మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం 25శాతం రాయితీ అవకాశం కల్పించిన ఆశించిన స్థాయిలో ఫీజు చెల్లించలేదు. రూ.10వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే మిగిలింది.

26.76లక్షల దరఖాస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా 26.76లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 2,75,492, ఇతర యూడీఏలు 1,26,347, జీహెచ్​ఎంసీ 1,84,182, సీఎంసీ 1,14,530, ఎంఎంసీ 2,36,777, రాష్ట్రంలోని 9 మున్సిపల్ కార్పొరేన్లలో 3,38,688, మున్సిపాలిటీల్లో 8,61,502, గ్రామపంచాయతీల్లో 5,39,200 మొత్తం 26,76,718 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,991 దరఖాస్తులు వచ్చాయి.

సర్ ఎఫెక్ట్..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సీడీఎంఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించడానికి సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పైగా ఉన్న సిబ్బందిలోనే మెజార్టీ అధికారులు, ఉద్యోగులకు సైతం ఎస్ఐఆర్ బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా దరఖాస్తుల పరిశీలన కష్టంగా మారిందనిఉన్నతాధికారులు చెబుతున్నారు. దరఖాస్తులు అధికంగా ఉన్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, నల్లొండ మున్సిపాలిటీ, సూర్యపేట మున్సిపాలిటీలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ముందుకొస్తలేరు..

ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా..ఎన్ని సార్లు ఫీజులో రాయితీ కల్పించినా దరఖాస్తుదారులు మాత్రం ముందుకొస్తలేరు. ఫీజులు చెల్లించడంలేదు. 26.76లక్షల దరఖాస్తులకుగాను ఫీజు చెల్లించాలని ప్రభుత్వం 21.63లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ పంపించింది. ఇప్పటి వరకు 7.20లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మరో 14.42లక్షల దరఖాస్తుదారులు ఫీజు చెల్లించడానికి ముందుకురావడంలేదు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలకు చెందిన 7,02,357 దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ ఇస్తే 2,06,807 మంది మాత్రమే చెల్లించారు. మరో 4,95,550 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. హెచ్ఎండీఏలో సైతం 1,39,313మంది ఫీజు చెల్లించలేదు. అయితే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని దరఖాస్తులపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తుదారులు ఫీజు చెల్లించడానికి ముందుకురావడంలేదు.

3.20లక్షల దరఖాస్తులకు ప్రొసీడింగ్స్..

ప్రభుత్వం 21.63లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ ఇచ్చింది. వీటిలో 7.20లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. వీరిలో 3.20లక్షల దరఖాస్తులకు అధికారులు ప్రొసిడింగ్స్ జారీచేశారు. అంటే మరో 4లక్షల దరఖాస్తులకు ప్రొసిడింగ్స్ ఇవ్వాల్సి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ స్థాయిలో ఎల్1 బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించారు.ఎల్2గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఎల్3గా మున్సిపల్ కమిషనర్ నిర్ణయించారు. దీంతోపాటు పంచాయతీల్లో ఎల్1గా కార్యదర్శి, ఎల్2గా ఎంపీడీఓ, ఎల్3 అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)కు బాధ్యతలు అప్పగించారు. అయితే వీళ్లందరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఉండడంతో దరఖాస్తుల పరిశీలన అటకెక్కింది. దీంతోపాటు ప్రభుత్వ భూములు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ వంటి సమస్యలు ఉంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సిపార్సు చేస్తున్నారు. రెవెన్య, ఇరిగేషన్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొసిడింగ్స్ ఇవ్వడానికి ఆలస్యమవుతోందనే వాదన వినిపిస్తోంది.

ఈ నెలాఖరుకు 25శాతం రాయితీ

రాష్ట్రంలోని అనుమతిలేని లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు, చార్జీల్లో 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అవకాశం ఈనెలాఖరు వరకు ఉంది. గతంలో మార్చి 31వరకు అవకాశం ఇచ్చింది. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరోసారి 1మే నుంచి 31జులై వరకు ఈ అవకాశమిచ్చింది. అయితే ప్రభుత్వం ఆశించిన రూ.10వేల కోట్ల ఆదాయానికిగాను ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల ఆదాయం మాత్రం వచ్చింది. దీంతోపాటు ఫీజు చెల్లించిన దరఖాస్తులన్నింటికి ఈనెలాఖరు వరకు ప్రొసిడింగ్స్ ఇపవ్వాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story