- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం
సింహాచల సింహాద్రి అప్పన్న నేడు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న సింహాచల సింహాద్రి అప్పన్న క్షేత్రం నేడు భక్తులతో పోటెత్తింది. ఏటా వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే 'చందనోత్సవం' వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే లభించే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి 'నిజరూప దర్శనం' కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. నేడు తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని ఒలిచే ప్రక్రియను పూర్తి చేశారు. కాగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబానికి అర్చకులు తొలి దర్శన ఏర్పాట్లు చేసారు. అనంతరం సాధారణ భక్తులకు అనుమతినిచ్చారు. రాత్రి వరకు ఈ దర్శనాలు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ మరియు విశాఖ జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అలాగే గతేడాది ఇదేరోజు ఈ ఆలయంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.
చందనోత్సవం విశిష్టత..
సింహాచలం అప్పన్న స్వామి వారు ఏడాది పొడవునా 12 నెలల పాటు దట్టమైన చందన లేపనంతో కప్పబడి ఉంటారు. దీనివల్ల స్వామి వారు ఒక లింగాకారంలో కనిపిస్తారు. కేవలం ఈ చందనోత్సవం రోజున మాత్రమే స్వామి వారి శరీరంపై ఉన్న పాత చందనాన్ని తొలగించి, భక్తులకు స్వామి వారి నిజరూపం చూపిస్తారు. స్వామి వారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి, శరీర వేడిని తగ్గించడానికి ఈ చందన లేపనాన్ని పూస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఏటా అక్షయ తృతీయ రోజున సింహాద్రి అప్పన్న చందనోత్సవం పేరిట.. పాట చందనం ఒలిచి, కొత్త చందనం పూసే కార్యక్రమం నిర్వహిస్తారు.






