- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sharad Pawar: శరద్ పవార్‌కు అస్వస్థత.. పూణే ఆస్పత్రి వైద్యుల కీలక ప్రకటన
మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అనారోగ్యానికి గురవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధి తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి నుంచి సమస్య తీవ్రమవ్వడంతో సోమవారం మధ్యాహ్నం పూణేలోని రూబీ హాల్ క్లినిక్ (Ruby Hall Clinic) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు సిటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించగా, ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తాజా పరిస్థితిపై డాక్టర్ల ప్రకటన
శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై రూబీ హాల్ క్లినిక్ వైద్యులు స్పందించారు. ఈ మేరకు వారు మీడియా ముందుకు వచ్చి.. శరద్ పవార్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయనను ఐసీయూలో కాకుండా సాధారణ వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, మందులకు ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా రాజకీయ ఒత్తిడి, శారీరక శ్రమ, కుటుంబంలో జరిగిన విషాద పరిణామాల కారణంగా ఆయన అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్లు తెలిపారు.
ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ వెంట ప్రస్తుతం ఆయన కుమార్తె సుప్రియా సూలే, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. పవార్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఒకటి రెండు రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి.






