వరుసగా మూడో రోజు లాభాల్లో సూచీలు!

by Disha Web Desk 17 |
వరుసగా మూడో రోజు లాభాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాల నుంచి కోలుకుంటున్న సూచీలకు గురువారం కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ ర్యాలీ చేశాయి. ప్రధానంగా సాధారణ ఎన్నికలకు కీలకమైన ఉత్తరప్రదేశ్ ఫలితాల్లో బీజేపీ కూటమి విజయం ఖరారు కావడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. ఈ ఫలితాల ద్వారా కేంద్రంలో ప్రభుత్వం రానున్న రోజుల్లో కీలకమైన ఆర్థిక సంస్కరణ నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు ఉండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు దిగొస్తుండటం లాంటి కీలక సంకేతాలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 817.06 పాయింట్లు ఎగసి 55,464 వద్ద, నిఫ్టీ 249.55 పాయింట్లు ర్యాలీ చేసి 16,594 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ రంగాలు 2-3 శాతం పుంజుకోగా, మీడియా వరుసగా రెండో సెషన్‌లో భారీగా ర్యాలీ చేసింది. అయితే, ఐటీ ఇండెక్స్ మాత్రం స్వల్పంగా క్షీణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్‌మహీంద్రా, డా రెడ్డీస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు మెరుగైన లాభాలను చూశాయి.

ముఖ్యంగా హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.43 వద్ద ఉంది.


Next Story

Most Viewed