అధిక లాభాలతో ముగిసిన సూచీలు!

by Dishanational1 |
అధిక లాభాలతో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల జోరు కనిపించింది. అంతకుముందు సెషన్‌లో అధిక లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు బుధవారం ఉదయం ప్రారంభం నుంచే సానుకూలంగా కదలాడాయి. ప్రధానంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, గ్లోబల్ మార్కెట్లలో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఆర్థిక మాంద్యం భయాలతో బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గింది. దేశీయంగా పీఎల్ఐ పథకం వల్ల భారత జీడీపీకి 4 శాతం వరకు వృద్ధికి సహకారం లభిస్తుందని ఓ నివేదిక అభిప్రాయపడటం, సేవల రంగ కార్యకలాపాలు 11 ఏళ్ల గరిష్ఠానికి చేరడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది.

అదేవిధంగా చైనాలో కోరోనా సంబంధిత ఆంక్షలు తొలగించడం, దేశీయంగా వాహన పరిశ్రమ అమ్మకాలు పెరగడ, ముడి సరుకుల ధరలు తగ్గడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లకు సానుకూలంగా మారాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 616.62 పాయింట్లు ఎగసి 53,750 వద్ద, నిఫ్టీ 178.95 పాయింట్లు పెరిగి 15,989 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాలు 2 శాతానికి పైగా పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్పంగా బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్ ధరలు అధికంగా పెరిగాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 79.29 వద్ద ఉంది.


Next Story

Most Viewed