వారాంతం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
వారాంతం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రం పై దాడి ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. ఈ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. దీని ప్రభావం దేశీయంగా మార్కెట్లపై పడటంతో సూచీలు శుక్రవారం వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో కుదేలయ్యాయి. దీనికితోడు ముడి చమురు ధరలు దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. శుక్రవారం రోజున ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ సమయంలో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాలు, వారాంతం లాభాల స్వీకరణతో నష్టాలు తప్పలేదు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 768.87 పాయింట్లు పతనమై 54,333 వద్ద, నిఫ్టీ 252.70 పాయింట్లు క్షీణించి 16,245 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో ఐటీ ఇండెక్స్ స్వల్పంగా పుంజుకునే ప్రయత్నం చేసింది. ఆటో, మెటల్, రియల్టీ, ఫైనాన్స్, మీడియా రంగాల్లో అత్యధికంగా అమ్మకాల ఒత్తిడి కనబడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను దక్కించుకోగా, టైటాన్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్, ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.18 వద్ద ఉంది.


Next Story