నేటి నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా

by Muthe.Rajitha |

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలలో నేటి నుండి ఈనెల 30 తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహించనుంది.

నేటి నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలలో నేటి నుండి ఈనెల 30 తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహించనుంది. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ పంటల ధ్రువీకరించిన విత్తనాలను సరసమైన ధరలకు కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందేలా వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ విత్తన మేళాల్లో పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటల విత్తనాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటల విత్తనాలు, వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. సమగ్ర పోషక యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంచుతున్నారు. మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్‌ఎం–1638, కేఎన్‌ఎం –7715, డబ్ల్యూజీఎల్–44, హెచ్‌ఎంటీ సోనా వంటి సన్న రకాల విత్తనాలను సిద్దం చేశారు.

విత్తన మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపికపై కూడా రైతులకు మార్గదర్శకాలు అందించనున్నారు. విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకొని నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి కోరారు.

Next Story