- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో సెక్యూరిటీకే రక్షణ కరువు.. స్క్రాప్ దొంగల పైశాచికం!
సింగరేణిలో బరితెగించిన స్క్రాప్ మాఫియా! అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై వాహనాలతో దాడి. ప్రాణాలకు తెగించి ఆస్తులను కాపాడుతున్న రక్షణ సిబ్బందికి రక్షణే కరువు.

దిశ, పెద్దపల్లి యైటింక్లయిన్ కాలనీ : దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సుదీర్ఘ చరిత్ర కలిగిన 'సింగరేణి' సంస్థలో ఇప్పుడు రక్షణ సిబ్బందికే రక్షణ కరువైన దుస్థితి నెలకొంది. సంస్థకు చెందిన వందల కోట్ల రూపాయల ఆస్తులు, యంత్రాల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై స్క్రాప్ దొంగలు మూకుమ్మడిగా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. కేవలం దొంగతనాలకే పరిమితం కాకుండా, తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తే హత్యలు చేసేందుకు సైతం ఈ మాఫియా వెనుకాడడం లేదు. సింగరేణిలో దర్జాగా చోరీలకు పాల్పడుతూ అడ్డువచ్చిన రక్షణ సిబ్బందిపై పైశాచికంగా దాడులు చేస్తూ స్క్రాప్ దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. యాజమాన్యం పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దొంగలు మాత్రం తమదైన శైలిలో చోరీలకు పాల్పడుతూ సెక్యూరిటీ సిబ్బందిపై దాడులు చేస్తూ యాజమాన్యానికే నేరుగా సవాల్ విసురుతున్నారు.
అడ్డుకుంటే వాహనాలతో గుద్దేస్తున్నారు..
స్క్రాప్ దొంగల బరితెగింపునకు రామగుండం రీజియన్‌లో ఇటీవల జరిగిన ఘటనే సజీవ సాక్ష్యం. రామగుండం-3 ఏరియాలోని ఓసీపీ-1లో ఉన్న కన్వేయర్ బెల్ట్ పాత రోలర్స్‌ను చోరీ చేసేందుకు స్క్రాప్ దొంగలు భారీ ప్లాన్ వేశారు. పకడ్బందీగా స్క్రాప్ ఉన్న స్థలం, అక్కడికి వెళ్లే దారి, ఏ సమయంలో ఏ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉంటాడు? తదితర అన్ని విషయాలపై ముందుగానే రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం కోల్ కారిడార్ మార్గంలో కారులో వచ్చి, అక్కడ నిల్వ ఉన్న ఇనుప సామగ్రిని అపహరించేందుకు యత్నించారు.
దీన్ని పసిగట్టిన సింగరేణి సంస్థ భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వారిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగలు ఏమాత్రం భయపడకుండా తమ కారుతో సెక్యూరిటీ సిబ్బందిని అతి దారుణంగా ఢీకొట్టారు. ఈ దారుణ ఘటనలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు బొజ్జపల్లి శ్రీసాయికి తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న అతడిని తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆర్జీ-3 ఏరియా డిస్పెన్సరీకి తరలించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సింగరేణి వ్యాప్తంగా భద్రతా సిబ్బందిలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
‘ఇంటి దొంగల’ సాయం.. కార్పొరేట్ స్థాయిలో స్కెచ్
సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఇతరత్రా పనుల కోసం వినియోగించే భారీ యంత్రాలు, ఇనుప సామాగ్రి, విడిభాగాలు తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. వాటిని గని ఆవరణల్లోని షెడ్లు, వర్క్ షాపులు, స్టోర్స్‌కు తరలిస్తుంటారు. ఇలాంటి అత్యంత విలువైన వస్తువుల సమాచారం నేరుగా కొందరు 'ఇంటి దొంగల' ద్వారా బయట ఉన్న స్క్రాప్ మాఫియాకు చేరుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ముఠా సభ్యులు ఒకట్రెండు రోజుల పాటు సదరు ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తున్నారు.
సామగ్రి బరువు, రవాణా సౌలభ్యాన్ని బట్టి 5 నుంచి 15 మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో దాడులకు దిగుతున్నారు. అడ్డు వచ్చే రక్షణ సిబ్బందిపై మారణాయుధాలతో దాడులు చేస్తున్నారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌లు, కార్లు, ట్రాలీ ఆటోల్లో క్షణాల్లో స్క్రాప్ తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా కాపర్ కేబుల్స్ దొంగిలించి, వాటిని కాల్చి రాగి తీగను తీసుకెళ్లి బయట స్క్రాప్ దుకాణదారులకు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు.
దాడులను సీరియస్‌గా తీసుకున్న మేనేజ్‌మెంట్
స్క్రాప్ దొంగలు విభిన్న పద్ధతుల్లో చోరీలకు పాల్పడటం, అదే సమయంలో సంస్థ ఆస్తుల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై భౌతిక దాడులకు తెగబడుతుండటాన్ని సింగరేణి మేనేజ్‌మెంట్ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేవలం ఆస్తుల నష్టం మాత్రమే కాకుండా, సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుండటంతో యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. స్క్రాప్ చోరీలను, భౌతిక దాడులను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పోలీసు శాఖ సమన్వయంతో రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ స్క్రాప్ మాఫియాకు చెక్ పెట్టాలంటే భద్రతా పరమైన లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూసివేసిన గనులు, వివిధ విభాగాల ఆవరణలో నిల్వ ఉంచిన ఇనుప సామాగ్రి, కేబుల్స్ పైనే దొంగల కన్ను ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలను తక్షణమే తొలగించాలి. స్క్రాప్ నిల్వ ఉంచిన ప్రాంతం స్థానికులకు, రక్షణ సిబ్బందికి స్పష్టంగా కనిపించేలా హైమాస్ట్ లైట్లతో తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలి. విలువైన సామగ్రిని ఆరుబయట కాకుండా ఎప్పటికప్పుడు మెయిన్ స్టోర్స్‌కు తరలించి, అక్కడ సాయుధ భద్రతను పెంచాలి.
గనుల ఆవరణలు, వర్క్‌షాపులు, స్టోర్ల వద్ద మరిన్ని ఆధునిక పీటీజెడ్ ) నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించాలి. రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలి. వారికి తగిన కమ్యూనికేషన్ పరికరాలు, రక్షణ కవచాలు అందించాలి. అన్నిటికీ మించి దొంగలకు లోపలి గుట్టు చెబుతున్న 'ఇంటి దొంగల'ను గుర్తించి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అనుమానాస్పద స్క్రాప్ దుకాణాలపై పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించాలి.
పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం
సింగరేణిలో స్క్రాప్, విలువైన సామాగ్రి, భారీ యంత్రాల విడి భాగాల చోరీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం రెగ్యులర్ గస్తీ బృందాలతో పాటు ప్రత్యేకంగా ‘స్పెషల్ పార్టీ టీమ్స్’ను రంగంలోకి దించాం. చోరీలకు ఆస్కారం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను మ్యాపింగ్ ద్వారా గుర్తించి, అక్కడ నిఘాను మరింత తీవ్రతరం చేశాం. భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.- సుంకర మధుసూదన్, జీఎం, ఆర్జీ-3






