రేపే పాఠశాలలు పునఃప్రారంభం.. దమ్మపేట మండలంలో 35 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-14 12:18:06  IST  )

వేసవి సెలవులు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

రేపే పాఠశాలలు పునఃప్రారంభం.. దమ్మపేట మండలంలో 35 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
X

దిశ, దమ్మపేట: వేసవి సెలవులు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎన్నో ఆశలతో అక్షరాలు నేర్చుకునేందుకు బడిబాట పడుతున్న దమ్మపేట మండల విద్యార్థులకు తొలిరోజే నిరాశ ఎదురవుతోంది. బడులు తెరుచుకున్నా.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక విద్యావ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. మండల వ్యాప్తంగా ఏకంగా 35 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించే స్థోమత లేని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపిస్తున్నాయి. కానీ, తీరా అక్కడికి వెళ్లాక టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మండలంలో బడుల లెక్క ఇదీ..

దమ్మపేట మండల వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 107 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో 66 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం 18 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 4 గిరిజన ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. బడుల సంఖ్య బాగానే ఉన్నా, వాటిలో పాఠాలు చెప్పేందుకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడమే గమనార్హం. ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు విద్యా పునాది వేయాల్సిన ఎస్జీటీ పోస్టులే 10 వరకు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీలు పలకరిస్తున్నాయ్..

ఇక ఉన్నత పాఠశాలల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు అత్యంత కీలకమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 11 ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కఠినంగా అనిపించే ఇంగ్లిష్ సబ్జెక్టుకు మూడు, బయోసైన్స్‌కు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే భౌతిక శాస్త్రం రెండు, తెలుగు రెండు, సోషల్ ఒక పోస్టు చొప్పున ఖాళీలు దర్శనమిస్తున్నాయి. శారీరక దారుఢ్యం కోసం విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన పీఈటీ (1), పీడీ (1) పోస్టులతో పాటు పాఠశాల పాలన వ్యవహారాలు చూసే ప్రధానోపాధ్యాయుడి 1 పోస్టు సైతం భర్తీకి నోచుకోలేదు. ఈ ప్రధాన ఖాళీలతో కలుపుకుని మండల వ్యాప్తంగా ఏకంగా 35 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.

ప్రశ్నార్థకంగా ఉత్తీర్ణత..

కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయులే లేకుండా విద్యార్థులు వార్షిక, బోర్డు పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధిస్తారన్నది ఆందోళనకరంగా మారింది. ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులపైనే అదనపు భారం పడుతుండటంతో విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయి. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే ఉపాధ్యాయుల కొరత మండల బడులను వెక్కిరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న 35 పోస్టులను భర్తీ చేయాలని, ప్రత్యామ్నాయంగా విద్యా వాలంటీర్లనైనా నియమించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని మండల ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story