రాయదుర్గం భూ వివాదంలో వెనక్కి తగ్గిన SBI

by Malleboina Mahesh |

రాయదుర్గం భూ వివాదం క్లోజ్.. ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన SBI, కోర్టు పిటిషన్ ఉపసంహరణ! బ్యాంక్‌తో ప్రభుత్వ లావాదేవీలు యథాతథం.

రాయదుర్గం భూ వివాదంలో వెనక్కి తగ్గిన SBI
X

దిశ, వెబ్ డెస్క్: రాయదుర్గం భూముల వేలం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి మధ్య గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు దఫాలు చర్చల అనంతరం రాయదుర్గం భూముల వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంటూ ఒక అడుగు వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు, సూచనలకు బ్యాంక్ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం,

ఈ వివాదానికి సంబంధించి ఎస్‌బీఐ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎస్‌బీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటు, వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఆఫర్ చేసిన ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల వేరే భూమిని తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) అధికారులతో ఎస్‌బీఐ ప్రతినిధులు మళ్లీ ప్రత్యేకంగా సమావేశమై తుది చర్చలు జరపనున్నారు.

ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీలు యథాతథం..

ఈ భూ వివాదం కారణంగా ఎస్‌బీఐపై కఠిన వైఖరి అవలంబించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ లావాదేవీలన్నింటినీ నిలిపివేస్తూ గతంలో అంతర్గత ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఎస్‌బీఐ సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐతో ప్రభుత్వ లావాదేవీలను యథాతథంగా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీని ప్రకారం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ ప్రభుత్వ గ్రాంట్ల కొనసాగింపుతో పాటు, ఎస్‌బీఐకి ఉన్న 'లీడ్ బ్యాంక్' (Lead Bank) హోదాను కూడా యథాతథంగా కొనసాగించనున్నారు. హైకోర్టులో తదుపరి విచారణ ముగిసిన వెంటనే ఈ భూ ఒప్పందం మరియు లావాదేవీల పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Next Story