40 కి పైగా దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ బ్యాన్.. లిస్టులో భారత్

by Muthe.Rajitha |

బర్ద్ ఫ్లూ వ్యాధి నేపథ్యంలో 40కి పైగా దేశాల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లు, గుడ్లపై సౌదీ అరేబియా నిషేధం విధించింది.

40 కి పైగా దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ బ్యాన్.. లిస్టులో భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియా నేడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు మరియు ఇతర పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిని తాత్కాలికంగా నిషేధించింది. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉండటం భారత పౌల్ట్రీ రంగానికి పెద్ద దెబ్బగా మారింది. హైలీ పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI)తోపాటు ముఖ్యంగా H5N1 వంటి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ ప్రకటించింది. ఇటీవల వివిధ దేశాల్లో నమోదైన అవియన్ ఫ్లూ ఔట్‌బ్రేక్‌లను సమీక్షించిన తర్వాత సౌదీ అరేబియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ (MEWA) ఈ నిషేధిత ప్రకటను విడుదల చేసారు. ప్రజల ఆరోగ్య సేఫ్టీ మాత్రమే కాకుండా తమ దేశీయ పౌల్ట్రీ రంగాన్ని వైరస్ ప్రమాదం నుంచి కాపాడడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలియజేసారు. అయితే ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బాయిల్ చేసిన పౌల్ట్రీ మాంసం, దాని సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించబోదని, కేవలం పచ్చి మాంసం, గుడ్లపై మాత్రమే ఈ నిషేధమని స్పష్టం చేసారు.

అయితే భారత్ పై కూడా బ్యాన్ విధించడానికి కారణం 2025 చివరి నుంచి 2026 ప్రారంభం వరకు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడం. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాది కోళ్లు చనిపోవడం, అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున కోళ్లను కల్లింగ్ చేయడం జరిగింది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని సౌదీ అధికారులు భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేశారు. ప్రస్తుతం మనదేశం నుంచి సౌదీకి పౌల్ట్రీ మాంసం, గుడ్లు, ప్రాసెస్డ్ చికెన్ ఉత్పత్తుల ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల ఎక్స్‌పోర్టర్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఈ నిషేధంలో భారత్‌తో పాటు చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల్లో కూడా ఇటీవల HPAI ఔట్‌బ్రేక్‌లు నమోదయ్యాయి. ఈ నిషేధాన్ని వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఆనిమల్ హెల్త్ నుంచి అధికారిక క్లియరెన్స్ లభించిన తర్వాత మాత్రమే తొలగిస్తారు. ఇక భారత్ లో కేసులు పూర్తిగా తగ్గినట్టు సర్వైలెన్స్ డేటా సమర్పించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్ధారణ పొందిన తర్వాత మాత్రమే సౌదీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేయే అవకాశం ఉంది. అప్పటివరకు భారత పౌల్ట్రీ రైతులు, ఎగుమతిదారులు గణనీయమైన ఆదాయ నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కొనసాగుతుంది.

Next Story