- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా ట్రెజరీకి చేరని వేతన బిల్లులు.. ఒకటో తేదీ జీతాలపై పెరిగిన సస్పెన్స్!
పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ పరిధిలోని యానంబైల్ రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 20 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు(FBO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు(FSO) వేతన బిల్లులు ఇప్పటివరకు ట్రెజరీకి సమర్పించకపోవడం అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, పాల్వంచ టౌన్: పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ పరిధిలోని యానంబైల్ రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 20 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు(FBO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు(FSO) వేతన బిల్లులు ఇప్పటివరకు ట్రెజరీకి సమర్పించకపోవడం అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి నెల 25వ తేదీ లోపు వేతన బిల్లులు ట్రెజరీకి చేరితేనే తరువాతి నెల ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమవుతాయి. అయితే గడువు ముగిసినా బిల్లుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో సంబంధిత ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.వేతన బిల్లుల సమర్పణలో జాప్యం ఎందుకు చోటుచేసుకుందనే అంశంపై ఉద్యోగ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సకాలంలో పూర్తి కావాల్సిన ప్రక్రియలో ఆలస్యం జరగడానికి గల కారణాలను ఉన్నతాధికారులు వెల్లడించాలని కోరుతున్నారు.
జీతాలు ఆలస్యమైతే ఈఎంఐలు, పిల్లల విద్యా ఫీజులు, కుటుంబ నిర్వహణ వంటి ఆర్థిక బాధ్యతలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), ప్రధాన అటవీ సంరక్షణాధికారి (సీసీఎఫ్) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వేతన బిల్లుల జాప్యానికి బాధ్యులెవరో గుర్తించి, వెంటనే బిల్లులను ట్రెజరీకి పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాల వంటి అత్యంత కీలక అంశంలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యులపై విచారణ జరిపి, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్ఠమైన వ్యవస్థను అమలు చేయాలని వారు కోరుతున్నారు.
వైల్డ్ లైఫ్ రేంజర్, అధికారి కవిత మాధురిని వివరణ కోరగా.. యానంబైల్ రేంజ్‌లో వేతన బిల్లుల జాప్యంపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి సంబంధిత రేంజ్ అధికారి స్పందించారు. వేతన బిల్లుల సమర్పణలో జాప్యం రేంజ్ కార్యాలయం వల్ల కాదని, హెడ్‌క్వార్టర్స్ స్థాయిలో బిల్లులు సకాలంలో సమర్పించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ఈ విషయమై సంబంధిత సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు మెమోలు జారీ చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రేంజ్ కార్యాలయంలో క్లర్క్ కూడా లేకపోవడంతో పరిమిత సిబ్బందితోనే పరిపాలన పనులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాను మహిళా అధికారిణిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ కార్యాలయ నిర్వహణను కొనసాగిస్తున్నప్పటికీ, యూనియన్ నాయకులు డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు.అయితే ఉద్యోగుల వేతన బిల్లులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, జాప్యం లేకుండా ట్రెజరీకి పంపేలా చర్యలు చేపడుతున్నామని ఆమె స్పష్టం చేశారు.






