- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన జైపాల్ యాదవ్, చిరుమర్తి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) దూకుడు పెంచింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) దూకుడు పెంచింది. ఇటీవల ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaypal Yadav), నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) వేర్వేరుగా సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న (Tirupathanna) మొబైల్ ఫోన్ డేటాను నిశితంగా పరిశీలించగా, అందులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆయనతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరూ జరిపిన సంభాషణలపై అధికారులు జైపాల్ యాదవ్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ, తాను తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, అది రాజకీయ కారణాలతో కాదని, తమ సామాజిక వర్గానికి చెందిన ఒక భార్యాభర్తల గొడవను పరిష్కరించేందుకే రెండు ఫోన్ నంబర్లు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఆ నంబర్లను అధికారులు ట్యాప్ చేస్తారని తనకు తెలియదని ఆయన సిట్ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సిట్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా, కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రెడ్డి (Kondal Reddy), ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) కొడుకు సందీప్ రావును బుధవారం సిట్ ప్రశ్నించాల్సి ఉండగా, వయసు, అనారోగ్యం కారణంగా ఇంట్లోనే సిట్‌కు స్టేట్‌మెంట్ ఇస్తానని కొండల్ రెడ్డి తన అడ్వొకేట్ ద్వారా సమాచారం అందజేశారు. ఇక సందీప్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, మరో 4 రోజుల తర్వాత సిట్ ఎదుట విచారణకు హాజరవుతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ చీఫ్ సజ్జనార్‌కు ఫోన్‌లో తెలియజేశారు.






