నేడు శబరిమల మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివచ్చిన భక్తులు

by Kema Shiva Kumar |

శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ‘మకరవిలక్కు’ (మకరజ్యోతి) దర్శనానికి సమయం ఆసన్నమైంది.

నేడు శబరిమల మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివచ్చిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ‘మకరవిలక్కు’ (మకరజ్యోతి) దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం పొన్నంబలమేడు (Ponnambalamedu)పై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. నేడు మధ్యాహ్నం 3:13 గంటలకు మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. పందళం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేడు సాయంత్రం సన్నధికి చేరుకుంటాయి. ఈ ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి మహదీపారాధన నిర్వహిస్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం, పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది. సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:45 మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.

కేరళ సర్కార్ భారీ ఏర్పాట్లు..

మకరజ్యోతి (Makara Jyoti) దర్శనం సందర్భంగా సన్నిధానం, పంబ, హిల్ టాప్ వంటి ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో కేరళ ప్రభుత్వం (Kerala Government), ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (Travancore Devaswom Board) అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. జ్యోతి స్పష్టంగా కనిపించే 9 ప్రధాన ప్రాంతాలలో భక్తుల కోసం బారికేడ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలను కల్పించారు. సుమారు 2 వేల మందికి పైగా అదనపు పోలీసు సిబ్బంది బందోబస్తులో మోహరించారు. ఆలయంలో రద్దీ దృష్ట్యా నేడు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించడం లేదని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.

Next Story