స్ట్రీట్ లైట్స్‌కు రూ.1,341.60 కోట్లు

by Muthe.Rajitha |

కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) ఏరియాలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్ట్రీట్ లైట్స్‌కు రూ.1,341.60 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) ఏరియాలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల కాలపరిమితితో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టు టెండర్ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు, సవరణలు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో నిరంతరాయంగా వీధి దీపాలు వెలిగేలా చూడటం, సాంకేతిక లోపాలను వెంటనే సరిదిద్దడం, అత్యాధునిక సాంకేతికతను జోడించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

రూ.1,341.60 కోట్ల భారీ బడ్జెట్

వీధి దీపాల నిర్వహణ ప్రాజెక్టు కింద మొత్తం 7,60,591 ఎల్‌ఈడీ వీధి దీపాలతో పాటు, వాటిని నియంత్రించే సీసీఎంఎస్ ప్యానెళ్లు, ఇతర అనుబంధ మౌలిక వసతుల సమగ్ర నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం పన్నులు మినహాయించి రూ.1,341.60 కోట్ల పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఆమోదించిన ముఖ్యమైన మార్పులు

కమిటీ సిఫార్సులు, వివిధ భాగస్వామ్య పక్షాల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, ప్రాజెక్టును మరింత సులభంగా, పారదర్శకంగా అమలు చేయడానికి టెండర్ నిబంధనల్లో కింది మార్పులను ఆమోదించింది. వీధి దీపాల పర్యవేక్షణకు కీలకమైన సీసీఎంఎస్ ప్యానెళ్ల ఆధునీకరణను 6 నెలల్లోగా దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత వీధి దీపాల స్థానంలో కొత్త ఎల్‌ఈడీ దీపాలను అమర్చే ప్రక్రియను గరిష్ఠంగా రెండేండ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపార సౌలభ్యం కోసం నిబంధనలను ప్రభుత్వం మార్చింది. జాతీయ స్థాయి కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు బ్యాంక్ సాల్వెన్సీ పరిమితిని మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ల పెట్టుబడి ఇబ్బందులను తొలగించడానికి, సంప్రదాయ బ్యాంక్ గ్యారెంటీలకు బదులుగా ‘ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లను’ సమర్పించేందుకు ప్రభుత్వం అనుమతించింది. నగర విస్తరణకు తగినట్లుగా అదనపు దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్ నగరం నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో, కొత్త కాలనీలు, లేఅవుట్ల అవసరాల కోసం ప్రతి ఏటా 15 వేల కొత్త ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి నిబంధన విధించారు. 7 ఏళ్లలో సింగిల్ కాంట్రాక్ట్ ద్వారా రూ.130 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలి (లేదా) రూ.20 కోట్ల విలువైన పనులు రెండు సార్లు, రూ.15 కోట్ల విలువైన పనులు మూడు సార్లు విజయవంతంగా పూర్తి చేసి, కనీసం రెండేళ్ల నిర్వహణ అనుభవం కలిగి ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతోపాటు ఏడేండ్లలో ఒకే ఒప్పందం కింద కనీసం 7వేల సీసీఎంఎస్ బాక్సులను అమర్చిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నోడల్ ఏజెన్సీగా జీహెచ్‌ఎంసీ

క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రాంతాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించారు.

Next Story