- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెప్మాలో 'ఆర్పీల' చేతివాటం.. రూ.18 లక్షల అవినీతి బట్టబయలు
నర్సంపేట మెప్మా (MEPMA) లో భారీ కుంభకోణం.. మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.18 లక్షల లోన్ల దందా! ఆరేళ్లుగా ఆడిట్ లేకపోవడంపై బాధితుల ఆగ్రహం.

దిశ, నర్సంపేట: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో మహిళా సంఘాలు ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సంఘాలను జమ చేసి వీవోగా ఏర్పాటు చేసి వాటిని పురోగమనం వైపు నడిపించేందుకు రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లను మెప్మా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు ఆర్పీల మూలంగా, క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో మహిళా సంఘాల్లో తిరోగమన ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి నెలకు రెండు లేదా కనీసం ఓసారి మహిళా సంఘ సభ్యులు మీటింగ్ పెట్టేలా చూడటం మొదలు, ఏడాదికి ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసే వరకు ఆర్పీలు సంఘాల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలను సంఘం సభ్యులకు తెలపడం, సంఘాల బుక్స్ పారదర్శకంగా రాయడం, బ్యాంకు నుంచి అప్పు ఇప్పించడం, రికవరీ చేయించడం సహా పొదుపులు, అప్పులు, చెల్లింపులు పట్ల సభ్యురాళ్లకు పూర్తి అవగాహన కలిగించాలి.
ఆరేళ్లుగా లెక్కల్లేవ్..
నర్సంపేట పట్టణంలోని శాంతి సమాఖ్యలో ఆరేళ్లుగా చిన్న సంఘం లెక్కలు లేవని క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలడం విస్మయానికి గురి చేస్తోంది. కొన్ని రోజులుగా నర్సంపేట లో జరుగుతున్న పరిణామాలతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణ సమాఖ్యలో గతంలో 37 స్లమ్ డెవలప్మెంట్ ఫెడరేషన్లు (ఎస్.ఎల్.ఎఫ్) ఉండేవి. దాదాపు ఏడాది కిందట మున్సిపాలిటీలో 8 గ్రామాలు విలీనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నర్సంపేట మెప్మాలో 51 ఎస్ఎల్ఎఫ్, విభిన్న ప్రతిభావంతుల సమాఖ్య (టీఎల్ఎఫ్ )ఒకటి ఉంది.
మొత్తం 12,873 సభ్యులతో 1,217 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఎస్.ఎల్.ఎఫ్ ఆడిటింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ చిన్న సంఘాల లెక్కలు 2020 నుంచి చేయడం లేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది మార్చిలో లెక్కలు చేయాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. దాదాపు ఆరేళ్లు దాటుతున్నా ఆడిట్ లేదని మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘాల్లో అప్పులు, పొదుపులు, చెల్లింపుల లెక్కలు సభ్యులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. బుక్ కీపింగ్ పనులు అంతంత మాత్రమే. మరికొందరు ఏకంగా మినీ బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారని చర్చ సైతం జరుగుతోంది.
గ్రీవెన్స్ ను ఆశ్రయించిన బాధితులు..
నర్సంపేట మున్సిపల్ లోని 11 వార్డుకు చెందిన విఘ్నేశ్వర, రాజేశ్వర వీవో చూస్తున్న ఆర్పీలు అవకతవకలకు పాల్పడినట్లు గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. సంఘ సభ్యులకు తెలియకుండా విఘ్నేశ్వర వీవో పరిధిలో ఓ సంఘం అధ్యక్షురాలు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకు లోన్లు తీసుకున్నట్లు తెలిపారు. విషయం వెలుగు చూడటంతో స్థానికంగా ఆర్పీ పరిధిలో లెక్కలు చేయగా రూ.4 లక్షలు లెక్క తేలింది. అనుమానంతో మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఆడిట్ చేయించగా రూ.18 లక్షలు తేలినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో మిగతా సంఘాలు సైతం ఆందోళన చెందుతున్నాయన్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం..
నర్సంపేట పట్టణ సమాఖ్య పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంఘాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన ఆర్పీల విధులు, బాధ్యతల పట్ల ఉన్నతాధికారుల ఉదాసీనత ప్రదర్శించడంతో సమస్య క్రమక్రమంగా పెరిగిపోయింది. ఏళ్లుగా కనీసం సంఘాల ఆడిట్ నివేదికలను చెక్ చేయడం, తప్పొప్పులను సరిచేసే ప్రయత్నం చేయక పోవడం విమర్శలకు కారణం అవుతోంది. ఈ క్రమంలో కొందరు ఆర్పీలతో దగా పడుతున్న బాధిత మహిళా సంఘాలు రోడ్డెక్కుతున్నారు. మూకుమ్మడిగా ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా చిన్న సంఘాల లెక్కలు మొదలుపెట్టి సంఘ సభ్యురాళ్లకు భరోసా నివ్వాలని, మోసం చేసిన వాళ్ల నుంచి రికవరీ చేయాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.






