నెట్టింట వణుకు పుట్టిస్తున్న వీడియో.. బాంబు పేలుడుతో ప్రాణాలు కోల్పోయిన రౌడీ షీటర్!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-16 03:36:23  IST  )

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రతీకారం కోసం బాంబులు తయారు చేస్తూ రౌడీషీటర్ షానవాజ్ మాలిక్ ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 27న తన ఇంటి డాబాపై తల్లి, కాబోయే భార్యతో కలిసి ముడి బాంబులు సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నెట్టింట వణుకు పుట్టిస్తున్న వీడియో.. బాంబు పేలుడుతో ప్రాణాలు కోల్పోయిన రౌడీ షీటర్!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విడియో వణుకు పుట్టిస్తుంది. ఇంటి టెర్రస్ పై భారీ పేలుడు జరగడంతో మంటలు అంటుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆ వీడియో లో స్పష్టంగా కనిపించాయి. ఈ షాకింగ్ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని సుందరపడ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒక రౌడీ షీటర్ తన శత్రువుల పై ప్రతీకారం తీర్చుకోవాలని రచించిన వ్యూహం అతనికే ముప్పుగా మారింది.

షానవాజ్ మాలిక్ అనే రౌడీ షీటర్, జనవరి 27న తన ఇంటి డాబాపై కుటుంబ సభ్యులతో కలిసి ముడి బాంబులను (crude bombs) తయారు చేస్తుండగా అకస్మాత్తుగా అది పేలిపోయింది. ఈ భయంకరమైన పేలుడులో షానవాజ్ మాలిక్‌తో పాటు అతని తల్లి లిజాతున్ బీబీ కూడా తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొదట బాణాసంచా పేలడంతో గాయాలైనట్లు భావించినప్పటికీ పోలీసుల విచారణలో ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

సీసీటీవీలో రికార్డైన బీభత్సం

గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు వణుకు పుట్టిస్తున్నాయి. బాంబు తయారు చేస్తున్న సమయంలో జరిగిన పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ తో నిండిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్ కాబోయే భార్య, అతని అనుచరుడు అమియా కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు డాబా పైన ఉన్న నీళ్ల ట్యాంకుల వద్ద బీభత్సం నెలకొనడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

దర్యాప్తులో షాకింగ్ నిజాలు

ఈ సంఘటనపై పోలీసులు, ఎన్‌ఐఏ (NIA) రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టాయి. కేవలం ఒక చిన్న గొడవ వల్ల ప్రతీకారం తీర్చుకోవటానికి ఇంత పెద్ద ఎత్తున బాంబులు తయారు చేస్తున్నారా? లేదా దీని వెనుక మరేదైనా పెద్ద కుట్ర ఉందా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. సొంత కుటుంబ సభ్యులనే ఈ ప్రమాదంలోకి లాగి, వారి ప్రాణాలనే పోగొట్టిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story