నార్కట్‌పల్లిలో ‘నరక’ప్రాయంగా రహదారి.. మూడేళ్లుగా అసంపూర్తిగానే విస్తరణ పనులు

by Malleboina Mahesh |

నార్కట్‌పల్లిలో రోడ్డు విస్తరణ జాప్యం! 3 ఏళ్లుగా అసంపూర్తి పనులు.. 16 కోట్ల నిధులున్నా తప్పని తిప్పలు. ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతి.

నార్కట్‌పల్లిలో ‘నరక’ప్రాయంగా రహదారి.. మూడేళ్లుగా అసంపూర్తిగానే విస్తరణ పనులు
X

దిశ, నకిరేకల్ (నార్కట్ పల్లి):నార్కట్ పల్లి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు మూడేళ్లయినా ముందుకు సాగడం లేదు. విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు తప్ప రోడ్డు పనులను పూర్తి చేయడం లేదు. దీనికి తోడు చేసిన పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యలో నిర్మించిన డివైడర్ ఒక అడుగు ఎత్తు మాత్రమే నిర్మించడంతో ద్విచక్ర వాహనదారులు ఢీకొని గాయాలపాలవుతున్నారు.

అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీని నిర్మించాల్సి ఉన్న ఒకవైపు మాత్రమే నిర్మించి వదిలేశారు. నిర్మించిన చోట రోడ్డుకు ఎత్తుగా డ్రైనేజీ ఉందని అమ్మనబోలు రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీని కొంతమేర ఎత్తు తగ్గించారు. నిర్మించిన డ్రైనేజీ పైకి మళ్లీ కట్టడాలు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు అవేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నల్లగొండ రోడ్డు చౌరస్తాలో రోడ్డును ఎత్తుగా నిర్మించడంతో గత మూడు నెలలుగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

రూ.16 కోట్లతో పనులు..

నార్కట్ పల్లి పట్టణంలోని రోడ్డు సుందరీకరణ పనులకు రూ.16 కోట్లను కేటాయించారు. 2023 వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ నేటికీ పనులు పూర్తి చేయలేదు. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు మూడేళ్లయినా పూర్తి చేయలేదు. అయినా అధికారులు ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోలేదు. లారీ ఆఫీస్ నుంచి సన్ షైన్ కాలనీ వరకు మొదటగా ప్రారంభించిన ఈ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నార్కట్‌పల్లి పట్టణంలోకి వచ్చే రెడ్డయ్య ఫ్యాక్టరీ నుంచి లారీ ఆఫీస్ వరకు, సన్ షైన్ కాలనీ నుంచి కామినేని ఫ్లైఓవర్ వరకు ఏర్పాటు చేసే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

దీంతో నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు కామినేని ఆస్పత్రికి వచ్చే రోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే కంకర దుమ్ముతో అనేక వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పాలకులు ముందుచూపుతో రూ.16 కోట్లు ప్రకటించినప్పటికీ ఈ రోడ్డు విస్తరణ ఆలస్యం ఎందుకని అర్థం కావడం లేదు. ముందుగా విద్యుత్ మరమ్మతులకు కావలసిన నిధులు సరిపోకపోవడం వల్ల ఆలస్యమైందని ఆరోపణలు వినిపించినప్పటికీ ప్రస్తుతం ఆ విద్యుత్ పనులన్నీ పూర్తయ్యాయి. అయినా ఈ రోడ్డు విస్తరణ పనులు సాగకపోవడం వెనుక మర్మమేమిటనేది తెలియడం లేదు.

రోడ్డు ఆక్రమణలతో ప్రమాదాలు..

రోడ్డు విస్తరణ పనులు ఒకవైపు ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు రోడ్డు ఆక్రమణలతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత మూడు నెలలుగా నల్లగొండ రోడ్డు చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, పదుల సంఖ్యలో డివైడర్లకు ఢీకొని గాయాల పాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. గత నెలలో జరిగిన ప్రమాద తీవ్రతను తెలుసుకొని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సమయంలో రోడ్డు ఆక్రమణలు జరుగుతున్నాయని ఆక్రమించిన దుకాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎస్పీ ఆదేశాలతో హడావుడి చేసిన అధికారులు కేవలం కొంతమేర మాత్రమే వెనుకకు జరిపి వదిలేశారు. దీనిని బట్టి చూస్తే ఎస్పీ ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రోడ్డు పరిస్థితి ఎప్పటిలాగే మారిపోయింది. ప్రతి శుక్రవారం జరిగే వారసంత రోజున రోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రజలు అధిక సంఖ్యలో సంతకు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటన్నింటికి తోడు కొంత మంది దుకాణదారులు డ్రైనేజీపై ఆక్రమాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు ఆక్రమించిన దుకాణాలతో పాటుగా డ్రైనేజీ పై ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు.

Next Story