- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి
విశాఖపట్నం బీచ్ రోడ్డులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ప్రాణాలను బలితీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం బీచ్ రోడ్డులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ప్రాణాలను బలితీసుకుంది. వీకెండ్ సరదా కోసం బయలుదేరిన ఆ యువకులు విగతజీవులుగా మారడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను విశాఖకు చెందిన గంగిరి కుషాల్‌కుమార్, కనిగిరికి చెందిన షేక్ తౌసీఫ్ గా గుర్తించారు. వీరిద్దరూ నగరంలోని టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
ప్రమాద వివరాల్లోకి వెళితే.. వారాంతపు సెలవు కావడంతో వీరిద్దరూ శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్‌లో గడిపారు. శనివారం ఉదయం సూర్యోదయాన్ని చూసేందుకు ద్విచక్ర వాహనంపై భీమునిపట్నం వైపు బయలుదేరారు. ఐఎన్‌ఎస్ కళింగ దాటిన తర్వాత ఎర్రమట్టి దిబ్బల సమీపంలో బైక్ అతివేగంగా వెళ్తుండటంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే మృతుల ముఖాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జయ్యాయి. వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో గుర్తింపు ప్రక్రియ పోలీసులకు సవాలుగా మారింది. చివరకు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు వారి వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు కుషాల్ తండ్రి విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగి కాగా, తౌసీఫ్ తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా కనిగిరిలో నివసిస్తున్నారు.






