సర్కార్​కు షాకిచ్చిన్న రెవెన్యూ ఉద్యోగులు.. సదస్సులపై ఫైర్​

by Disha Web Desk |
సర్కార్​కు షాకిచ్చిన్న రెవెన్యూ ఉద్యోగులు.. సదస్సులపై ఫైర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15 నుంచి తలపెట్టిన రెవెన్యూ సదస్సులకు ఉద్యోగుల నుంచి సహాయ నిరాకరణ వ్యక్తమవుతున్నది. రెవెన్యూ సదస్సుల ద్వారా మళ్లీ తమను మరింత బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందే తప్ప మరొకటి కాదు. పొరపాట్లకు రెవెన్యూ డిపార్ట్ మెంట్ కారణంగా చూపిస్తారు. పైగా వీఆర్వోలు డ్యూటీల్లో లేరు. వీఆర్ఏలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. ఇక క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలించే మానవ వనరులెక్కడున్నాయన్న వాదన వినిపిస్తున్నది. ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి సరైన ఆప్షన్లు లేవు. వాటి పరిష్కారానికి గైడ్ లైన్స్ రూపొందించలేదంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీ, ప్రగతి భవన్​సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ వీఆర్ఏలు ఆగ్రహంతో ఉన్నారు.

ఈ మేరకు తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అలాగే అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని, సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని వీఆర్వోలు కోరుతున్నారు. 6, 12, 18 సంవత్సరాల ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సర్వ్ టు ఆర్డర్ ద్వారా ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వీఆర్వోల అభీష్టం మేరకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ బదిలీలు, స్పౌజ్, మెడికల్, ఒంటరి మహిళలు, వితంతువులు, మహిళలకు ప్రాధాన్యతతో కూడిన బదిలీలు చేపట్టాలంటున్నారు. రెవెన్యూ శాఖలో క్యాడర్ స్ట్రెంథ్​ని పెంచాలన్న డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ డిమాండ్లతో పాటు వీఆర్వోలను రెవెన్యూలోనే కొనసాగించాలంటూ వీఆర్వోల సంక్షేమ సంఘం ఈ నెల 12న జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించనుంది. అప్పటికీ స్పందించకపోతే 28న చలో హైదరాబాద్​కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికపాటి ఉపేందర్ రావు ఇప్పటికే ప్రకటించారు.

ఉద్యోగుల డిమాండ్

పదోన్నతుల కోసం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు ఎదురుచూస్తున్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగినా ఉద్యోగుల సంఖ్య మాత్రం అలాగే ఉన్నది. కొత్తగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించారు. కానీ అదనపు సిబ్బందిని మాత్రం ఇవ్వలేదు. కనీసం అడిగిన మ్యుచువల్, స్పౌజ్ బదిలీలు కూడా చేపట్టడం లేదంటున్నారు. ఎక్కడా డిపార్ట్ మెంట్ పట్ల గౌరవం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రెవెన్యూ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ పోస్టుతో పాటు డీఆర్వో, ఎస్డీసీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించి, ధరణిలో సరైన ఆప్షన్స్ ఇచ్చే వరకు సదస్సులను బాయ్‌కాట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగులు వారి సంఘ నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవేమీ లేకుండా సదస్సులకు హాజరైతే తప్పులకు మనమే కారణమని మనల్ని మరింత చులకన చేయడం ఖాయమంటున్నారు. 11 తారీఖున కలెక్టర్లతో సీఎం సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పటి దాకా వేచి చూస్తామని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ అయితే ఏది ఏమైనా రెవెన్యూ సదస్సులో వీఆర్వోలు పాల్గొనరన్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని, ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని వీఆర్ఏల సంఘం నేత రమేష్​బహదూర్ చెప్పారు. మిగతా సంఘాల మీద కూడా ఉద్యోగులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిసింది.


Next Story

Most Viewed