అన్ని వర్గాలతో పాటు బీసీలకూ రేవంత్ ద్రోహం చేశాడు: హరీశ్‌రావు

by Malleboina Mahesh |

బీసీలకు ఏటా 20 వేల కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని హరీశ్ రావు విమర్శించారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అన్ని వర్గాలతో పాటు బీసీలకూ రేవంత్ ద్రోహం చేశాడు: హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏటా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పి మాట తప్పారని.. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లు, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు అతీగతి లేకుండా పోయిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదని.. రాబోయే బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని.. వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతానని చెప్పారు.

Next Story