- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలనలో 'నిర్బంధం'.. ఆరు గ్యారెంటీలు ఎక్కడ: బీజేపీ ఎమ్మెల్యేలు
ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నిర్బంధ పాలన సాగిస్తోంది. బీజేపీ కార్యకర్తల అరెస్టులను ఖండిస్తున్నాం. అసెంబ్లీలో నిలదీస్తాం - ఎమ్మెల్యే ధన్పాల్.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన 'ఆరు గ్యారెంటీలను' రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. హామీల అమలు కోరుతూ బీజేపీ చేపట్టిన 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, గతంలో కేసీఆర్ పాలన కంటే దారుణమైన నిర్బంధం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కనిపిస్తోందని విమర్శించారు. ఇదే పద్ధతి అవలంబించిన బీఆర్ఎస్‌ను ప్రజలు గద్దె దించారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, చేస్తున్న ఖర్చులకు అస్సలు పొంతన లేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 2500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు వంటి ఆకర్షణీయమైన హామీలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి అరెస్టులకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.






