తమిళనాట రిసార్ట్ రాజకీయాలు షురూ

by Muthe.Rajitha |

TVK అధినేత, నటుడు విజయ్ తన పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు ఆయన "రిసార్ట్ రాజకీయ" వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు.

తమిళనాట రిసార్ట్ రాజకీయాలు షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో ఫలితాలకు ముందే వేడి మొదలైంది. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండటంతో, తన పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు ఆయన "రిసార్ట్ రాజకీయాల" వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ఇందుకోసం మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద ఉన్న ఒక విలాసవంతమైన ప్రైవేట్ రిసార్ట్‌ను పార్టీ మొత్తం బుక్ చేసింది. సుమారు 100 మందికి పైగా బస చేసే సదుపాయం ఉన్న ఈ రిసార్ట్‌లో, గెలిచిన అభ్యర్థులందరినీ ఒకే చోట ఉంచి ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా చూడాలని విజయ్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రిసార్ట్‌కు చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు అందుబాటులో ఉండవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీలు ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడే అవకాశం ఉందని ముందస్తుగా ఊహించిన టీవీకే, ఈ రిసార్ట్ క్యాంప్ ద్వారా తన బలాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. గతంలో తమిళనాడులో కూవం వంటి రిసార్ట్ రాజకీయాలు సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తూ తన రాజకీయ అరంగేట్రం ఫలితాలను భద్రపరుచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఫలితాల తర్వాత ఈ రిసార్ట్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story