- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు యూనివర్సిటీలో ఘనంగా 'ధార్మిక శిఖర' పురస్కారాల ప్రదానోత్సవం
సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బనారస్ గురూజీ పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బనారస్ గురూజీ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో తిరుమలనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన 'ధార్మిక శిఖర బహుమతి ప్రధానోత్సవం' వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువులలో మరింత చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ ధార్మిక సంప్రదాయాలను పాటిస్తూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రముఖ సినీ నటులు ఉప్పలూరి సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ, తాను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నానని, మన సంప్రదాయాల్లోని అతీంద్రియ శక్తులను తెలుసుకొని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు.
అలాగే బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే శక్తులను ఎదుర్కోవాలంటే నిత్యం దేవాలయాలను దర్శించి దైవశక్తిని పొందాలని సూచించారు. అనంతరం తిరుమలనాథ ట్రస్ట్ కార్యదర్శి గోపాలుని హరిహరరావు మాట్లాడుతూ.. శ్రీశైలం సమీపంలోని దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయ నిర్మాణం కోసం గత ఐదేళ్లుగా ట్రస్ట్ కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని, ఎడవల్లి గ్రామ ప్రజలు ఈ కార్యంలో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు.
ట్రస్ట్ కోశాధికారి బాల శ్రీనివాసులు దాతలకు ధన్యవాదాలు తెలియజేయగా, ఈ వేడుకలో భాగంగా సమాజంలో ధార్మిక సేవలు అందిస్తున్న సుమారు 50 మందికి 'ధార్మిక శిఖర' పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపాలుని నరసింహారావు, ప్రసాద్, రాపాక ప్రభాకర్, అలుగుల లక్ష్మయ్య, లలిత దాక్షాయణి మరియు ఎడవల్లి గ్రామస్తులు పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తులో మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.






