గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట: రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు.. కేంద్రం కీలక నిర్ణయం!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-21 12:26:13  IST  )

గ్యాస్ సంక్షోభం వేళ రాష్ట్రాలకు ఊరటనిస్తూ అదనంగా 20% కోటాను పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట: రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు.. కేంద్రం కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశంలో గ్యాస్ కొరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఒక కీలక ముందడుగు వేసింది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ (Dr. Neeraj Mittal) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో గ్యాస్ కేటాయింపులపై స్పష్టతనిచ్చారు. ఈ నెల 23 (23.03.2026) నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20 శాతం గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రాలకు అందే మొత్తం గ్యాస్ కోటా, ప్రస్తుత సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 50 శాతానికి చేరుకుంటుందని, ఇది ప్రజలకు, వివిధ రంగాలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ అదనంగా కేటాయించిన 20 శాతం గ్యాస్‌ను వినియోగించడంలో కేంద్రం కొన్ని ఖచ్చితమైన ప్రాధాన్యతలను (Priority Sectors) నిర్ణయించింది. ముఖ్యంగా సామాన్యుల ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడిపే సబ్సిడీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, వలస కార్మికుల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్‌టిఎల్ (FTL) సిలిండర్ల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని డాక్టర్ మిట్టల్ తన లేఖలో స్పష్టం చేశారు.

కేంద్రం కేటాయించిన ఈ అదనపు గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా కేంద్రం హెచ్చరించింది. గ్యాస్ పక్కదారి (Diversion) పట్టకుండా తగిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని, అర్హులైన రంగాలకు మాత్రమే ఇది చేరేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. తదుపరి నోటిఫికేషన్ వెలువడే వరకు ఈ కొత్త కేటాయింపులు అమలులో ఉంటాయని, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మెరుగు పడే వరకు ఈ ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలకు ఆహార వ్యయాల పరంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Next Story