రాష్ట్రంలో రీయింబర్స్‌మెంట్స్ రచ్చ.. విద్యార్థుల్లో ఆందోళన

by Malleboina Mahesh |   (  Updated:2026-06-05 02:11:23  IST  )

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా అకౌంట్లలో వేసే జీవోపై హైకోర్టు స్టే. రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కోర్టుకెళ్లిన కాలేజీలు.

రాష్ట్రంలో రీయింబర్స్‌మెంట్స్ రచ్చ.. విద్యార్థుల్లో ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, కాలేజీల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజుల చెల్లింపులపై తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలు, మరోవైపు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల కోర్టు పిటిషన్లతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, డిగ్రీ, పీజీ ఇతరత్రా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు సుమారుగా 12 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.2500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొన్నేళ్లుగా ఈ బకాయిలు చెల్లించక పోవడంతో సుమారుగా రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

ఈ క్రమంలో సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో విద్యార్థులను వేధించకుండా ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాలోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే నిర్ణయం తీసుకుంది. కాగా, దీనిపై పలుమార్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఇటు కాలేజీ యాజమాన్యాలు తమ నుంచి ఫీజుల కోసం ఇబ్బంది పెడతాయా, ప్రభుత్వం అనుకున్న సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా ఖాతాల్లో వేస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే దోస్త్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఎప్‌సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్లు వస్తే తాము ఫీజులు చెల్లించగలమా అని వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి వీలైనంత తొందరగా క్లారిటీ వస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వస్తుంది కనుక, అడ్మిషన్ల సమయంలో కాలేజీలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని వేధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో జమ చేశాకే వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ సమయంలో ఫీజు చెల్లించాలని విద్యార్థులను ఇబ్బంది పెట్టొదన్న నిబంధన అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన హైకోర్టు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఏప్రిల్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈనెల 24న విచారణ

స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా జీవో నెంబర్ 7ను విడుదల చేసింది. ప్రధానంగా జీవో 12వ నిబంధనకు వ్యతిరేకంగా ఇటీవల యాజమాన్యాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. దీన్ని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరాయి. ఈ క్రమంలో ఈనెల 24 లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, కోర్టులో జరగబోయే విచారణపై ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ పూర్తి ధీమాతో ఉన్నాయి. గత ఐదేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని, అందువల్ల ఈ నెల 24న రాబోయే తీర్పు కచ్చితంగా తమకు అనుకూలంగానే వస్తుందని యాజమాన్యాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోర్టు తీర్పు ఎలా ఉంటుందో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియక లక్షలాది మంది పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

Next Story