రీల్స్ పిచ్చితో సంసారంలో చిచ్చు! బతికుండగానే భార్యకు తర్పణం వదిలేసిన డాక్టర్ భర్త

by Malleboina Mahesh |

రీల్స్ వ్యసనం ఒక కాపురాన్ని కూల్చేసింది. భార్య రీల్స్ పిచ్చితో విసిగిపోయిన ఒక డాక్టర్, ఆమె బతికుండగానే హరిద్వార్‌లో పిండం పెట్టి బంధాన్ని తెంచుకున్నాడు.

రీల్స్ పిచ్చితో సంసారంలో చిచ్చు! బతికుండగానే భార్యకు తర్పణం వదిలేసిన డాక్టర్ భర్త
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వ్యామోహం (Social media obsession) భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కొంత మంది రీల్స్ పిచ్చి వారి సంసారంలో చిచ్చు పెడుతుంది. ఈ సోషల్ మీడియా వ్యసనం ఏ స్థాయికి చేరుకుందో తెలిపే ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ (Reels) పిచ్చితో తన మాట వినని భార్య బతికుండగానే, ఆమె చనిపోయినట్లు భావించి ఓ భర్త ఏకంగా హరిద్వార్‌లోని గంగా నదిలో తర్పణం వదిలేశాడు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆ భర్త, తన భార్య నిరంతరం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సంసారాన్ని, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తోందని ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, భర్త మాటను ఏమాత్రం లెక్క చేయని ఆమె, అవసరమైతే భర్తను వదులుకుంటాను కానీ రీల్స్ చేయడం మాత్రం మానుకోనని తెగేసి చెప్పడంతో విసిగిపోయిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

హరిద్వార్ చేరుకున్న ఆ భర్త, గంగా నది తీరాన భార్య ఫోటోకు పూలమాల వేసి, హిందూ సంప్రదాయం ప్రకారం పిండ ప్రధానం చేసి, మరణించిన వారికి చేసే క్రతువులన్నీ పూర్తి చేశాడు. అనంతరం ఆ ఫోటోను గంగలో విడిచిపెట్టి, ఆమెతో ఉన్న బంధానికి స్వస్తి పలికాడు. "రీల్స్ పిచ్చితో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న దరిద్రం వదిలిపోయింది" అంటూ అక్కడి పూజారితో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, డిజిటల్ వ్యసనం కుటుంబ బంధాలను ఎలా చిన్నాభిన్నం చేస్తోందనే అంశంపై నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Next Story