- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల అండతో ఎర్రమట్టి దందా.. ‘ఇందిరమ్మ’ ఇళ్ల పేరుతో అక్రమ రవాణా!
మిర్యాలగూడ డివిజన్‌లో అధికారుల అండతో ఎర్రమట్టి అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు పొంది, గుట్టలను తవ్వేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారు

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఎర్రమట్టి కి గిరాకీ ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు గుట్టలను సైతం తవ్వి మట్టిని తరలిస్తున్నారు. అధికారుల సహకారంతోనే ఎర్రమట్టి అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. డివిజన్ పరిధిలోని వేములపల్లి మండలం మొల్కపట్నం, శెట్టి పాలెం గ్రామాలతోపాటు మాడుగుల పల్లి మండలంలోని ఇసుకబావిగూడెం, గుర్రప్పగూడెం గ్రామాలలో మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం, ఆలగడప గ్రామాల నుంచి ఎర్రమట్టి అక్రమ దందా కొనసాగుతోంది. కాగా ఈ వ్యాపారానికి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి అధికారుల వల్లనే నష్టం వాటిల్లుతున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమ వ్యాపారులకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. దీంతో మూడు జెసిబిలు ఆరు టిప్పర్లు అన్న చందంగా ఎర్రమట్టి వ్యాపారం సాగుతుంది.
భారీగా ఎర్రమట్టి రవాణా
డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల నుంచి వందల ట్రిప్పులలో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ. 5000 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు అందించి వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతోని వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనుమతులు
ఇటీవల కాలంలో ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేరేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. దీని ఆసరాగా తీసుకున్న అక్రమ వ్యాపారులు ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలించేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. కానీ అనుమతులతో టిప్పర్ల ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఎర్రమట్టిని డంపు చేసి ట్రాక్టర్ల ద్వారా అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టికి పట్టణంలో 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు పట్టణవాసులు పేర్కొంటున్నారు.
తీసుకునేది తక్కువ... తరలించేది ఎక్కువ
ఎర్ర మట్టిని తరలించాలంటే సర్వేనెంబర్ మారినా సరే మైనింగ్ అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ పర్మిషన్ లేకుండానే ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. వెయ్యి క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అనుమతులు ఇచ్చే అధికారులు సైతం కేవలం రోజులు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. ఎలాంటి వాహనాల్లో తరలిస్తున్నారో.. ఆ వాహనాల నెంబర్లు నమోదు చేయడం లేదు. దీంతో అక్రమ వ్యాపారులు మట్టిని తరలించేందుకు అనుమతులు పొందిన ఇష్టారాజ్యంగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అధికారులకు కంట కనబడుతున్న పట్టించుకోవడం లేదు. చివరికి గుట్టలను మాయం చేస్తుంటే రైతులు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు నమోదు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎర్రమట్టి అక్రమ రవాణాను నిలిపివేసి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.






