- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో రికార్డ్.. మండలంలో 100 శాతం పూర్తి!
మండలంలో ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయింది.

దిశ, మంగపేట: మండలంలో ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయింది. మండలంలో 37,524 మంది ఓటర్లకు ఫారాలు అందజేసి వంద శాతం పురోగతి సాధించడంలో రికార్డ్ నెలకొల్పారు. గ్రామాల్లో ఉన్న ఓటర్లు, వలస, డెత్, పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిన వారు, శాస్వతంగా ఊరు విడిచి వెళ్లిన వారు ఇలా ప్రతి ఓటరు ఫారాలను వారి కుటుంబాలకు అందించడంతో వంద శాతం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కాగా మ్యాపింగ్ పనులు కొంత మేరకు మందకొడిగా సాగుతున్నప్పటికీ పూర్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలు సేకరిస్తూ తమ మొబైల్ యాప్ లో డిజిటలైజేషన్ చేస్తున్నారు. సిగ్నల్ కొరత వంటి సాంకేతిక కారణాలతో డిజిటలైజేషన్ అక్కడక్కడ జాప్యం జరుగుతున్నా మందకొడిగా సాగుతోంది.
మ్యాపింగ్ వివరాల నమోదులో జాప్యం..
ఓటు మ్యాపింగ్ ప్రకారం బీఎల్ఓలు ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 2002 ఓటర్ లిస్టులో ఓటు హక్కు ఉన్న వారు ఒక వైపు తర్వాత ఓటు హక్కు పొందిన వారు మరో వైపు వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఈ విషయంలో ఓటర్లు తికమక పడుతున్నారు. బీఎల్ఓలు ఒక్క ఓటరుకు రెండేసి ఫారాలు అందిస్తుండగా వివరాలు నమోదు చేసి ఒక ఫారం బీఎల్ఓలు తీసుకుంటుండగా మరో ఫారం ఓటరు దగ్గర ఉంచుతున్నారు. ఈ విషయంలో ఓటర్లకు ఫారం నింపడంలో అయోమయానికి గురవుతున్నారు. సరైన వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండగా ఓటర్ల దగ్గర 2002 నాటి ఓటరు లిస్టు లేకపోవడం బీఎల్ఓలు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతుంది. ఓటరు పూర్తి స్థాయిలో ఫారాలు నింపిన తర్వాతనే బీఎల్ఓలు యాప్ లో డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియలో ఆలస్యం కావడంతో ఓటరు నమోదులో జాప్యం జరుగుతుంది. ఓటర్లు ఇచ్చిన ఫారాలను జూలై 31 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 29 వరకు పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తారు.
ఫారాలు నింపడంలో ప్రజల ఇబ్బందులు..
బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో అటవీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, నిరక్షరాస్యులు ఓటరు ఫారాలు నింపడంలో అందులోని వివరాలు అర్థం కాక అవసరమైన సమాచారాన్ని నమోదు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. నిరక్షరాస్యులు, వృద్దులైతే పూర్తిగా ఇతరులపై ఆధార పడుతున్నారు. ఫారాలు నింపడంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు గ్రామాల్లో ప్రత్యే సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఫారాలు నింపేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి వెంటనే డిజిటలైజేషన్ చేయాలని కోరుతున్నారు.
ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాము: తహసీల్దార్ తోట రవీందర్
మండలంలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన సమయంలోగా ప్రతి దశను పూర్తి చేసి వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాము. మండలంలో ఇప్పటికే వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశాము. ప్రజలు, రాజకీయ పార్టీలు, బీఎల్ఓ, బీఎల్ఏల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము.






