బెంగాల్ లో ఆ స్థానాలకు రీ పోలింగ్

by Muthe.Rajitha |

వెస్ట్ బెంగాల్ లో పలు కేంద్రాల్లో శనివారం రీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

బెంగాల్ లో ఆ స్థానాలకు రీ పోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలలో చోటుచేసుకున్న వివాదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్‌కు ఆదేశించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న హై-ప్రొఫైల్ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్‌లోని 4 బూత్‌లతో పాటు, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గంలోని 11 బూత్‌లలో శనివారం నాడు తిరిగి ఓటింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో ఓటర్లను స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకున్నారని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ రీ-పోలింగ్ ప్రక్రియ సాగనుంది. కేవలం ఆ 15 బూత్‌లలోనే కాకుండా ఫల్తా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లలో కూడా అక్రమాలు జరిగినట్లు తేలితే రీ-పోలింగ్ జరిగే అవకాశం ఉంది.

బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు అక్రమాలు జరిగిన చోట రీ-పోలింగ్ నిర్వహించడం తమ నైతిక విజయమని బీజేపీ పేర్కొంటుండగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకుని కావాలనే తమ నియోజకవర్గాల్లో గందరగోళం సృష్టిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా, మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ రీ-పోలింగ్ ఫలితాలు డైమండ్ హార్బర్ వంటి కీలక స్థానాల్లో అభ్యర్థుల మెజారిటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story