సామాన్యుడికి ఆర్బీఐ ఊరట: నియంత్రణలోనే ద్రవ్యోల్బణం.. 4.6 శాతంగా అంచనా

by Malleboina Mahesh |

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6%గా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా. యుద్ధ ప్రభావం ఉన్నా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని స్పష్టీకరణ.

సామాన్యుడికి ఆర్బీఐ ఊరట: నియంత్రణలోనే ద్రవ్యోల్బణం.. 4.6 శాతంగా అంచనా
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆర్బీఐ (RBI) సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే వార్తను తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఇది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం (4% +/- 2%) పరిధిలోనే ఉండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొట్టమొదటి ద్విమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని (Monetary Policy) ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

పశ్చిమాసియాలో (West Asia) చెలరేగిన యుద్ధ ఉద్రిక్తతలకు ముందు భారత స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని, అయితే మార్చి నెలలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారాయని గవర్నర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగినప్పటికీ, దేశీయంగా వృద్ధి రేటు నిలకడగా ఉంటుందని మానిటరీ పాలసీ కమిటీ (MPC) అభిప్రాయపడింది.

త్రైమాసిక వారీగా అంచనాలు:

వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరంలో కింది విధంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది:

మొదటి త్రైమాసికం (Q1): 4.0%

రెండవ త్రైమాసికం (Q2): 4.4%

మూడో త్రైమాసికం (Q3): 5.2%

నాల్గవ త్రైమాసికం (Q4): 4.7%

Next Story