నగర శివార్లలో రేవ్ కల్చర్

by Malleboina Mahesh |

హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్‌లు రేవ్ పార్టీలు, డ్రగ్స్ దందాలకు నిలయాలుగా మారుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నగర శివార్లలో రేవ్ కల్చర్
X

దిశ,తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో సంపన్నులు నగర శివార్లలో నిర్మించుకున్న ఫాంహౌస్‌లు నేరాలకు నిలయాలుగా మారుతున్నాయి. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపేందుకు ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లు.. అక్రమాలకు, హత్యలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీ అనే ముసుగులో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, వికృత చేష్టలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల తదితర శివారు ప్రాంతాలు నేడు డ్రగ్స్, పేకాట, రేవ్ పార్టీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన పోక్సో కేసుతో ఫాంహౌస్‌ల సంస్కృతిలోని మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. నగర శివార్లలోని ఫాంహౌస్‌లు వాటి వెనుక రాత్రివేళల్లో జరుగుతున్న గలీజు దందాలు తెరమీదకు వచ్చాయి.

విలాసం వెనుక విష సంస్కృతి

నగర శివార్లలోని ఫాంహౌస్‌లను వారాంతపు విడిది కోసం వెళ్లే కుటుంబాల కంటే, అసాంఘిక కార్యకలాపాల కోసం భారీ మొత్తానికి అద్దెకు తీసుకునే ముఠాలే ఇప్పుడు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఈ ఫాంహౌస్‌లలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. గంజాయి, హుక్కా తో మొదలై అత్యంత ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ ఎండీఎంఏ, కొకైన్ తదితర.. డ్రగ్స్ ఇక్కడ యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. రాత్రంతా చెవులు చిల్లులు పడే శబ్ధాలతో సాగే అశ్లీల నృత్యాలు, విదేశీ యువతులతో వ్యభిచారం లాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వీటికి తోడు కోడి పందాలు, పేకాట స్థావరాలుగా ఇవి రూపాంతరం చెందాయి. ఒక్కో రాత్రికి లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతోంది. ఈ పార్టీలకు వస్తున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లు ఉండటం, వారు తీవ్రంగా మత్తుకు బానిసలవుతుండటం సమాజానికి పెద్ద ప్రమాద సంకేతం గా మారింది.

బట్టబయలవుతున్న వ్యవహారాలు

ఫాంహౌస్‌ల చీకటి దందాల్లో సామాన్యుల కంటే రాజకీయ, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తల పేర్లే ఎక్కువగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతుండటం గమనార్హం. గతంలో పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల అదే ఫాంహౌస్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ జరగడం, గన్ ఫైరింగ్ చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంతో ఫాంహౌస్‌లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీల సన్నిహితులు సైతం ఇక్కడ కోడి పందేలు, జూదం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కళ్ళు కప్పుతున్న నిర్వాహకులు

సైబరాబాద్, రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు నిరంతరం ఫాంహౌస్‌లపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నా.. నిర్వాహకులు మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నారు. వీకెండ్ పార్టీల వివరాలను ఎక్కడా బహిర్గతం కాకుండా కేవలం వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ సీక్రెట్ పేజీలు, అత్యంత సన్నిహితులైన క్లోజ్డ్ సర్కిల్స్‌లోనే పంచుకుంటున్నారు. స్థానిక ఫాంహౌస్ వాచ్‌మెన్లు, మేనేజర్లకు భారీగా డబ్బు ఆశచూపి వారినే తమకు ఇన్‌ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గానీ, పోలీసు వాహనాలు గానీ వస్తే కదలికలను ముందే గమనించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వెళ్లేసరికే ఆధారాలు మాయం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాల్సిందే..

ఫాంహౌస్‌లను కేవలం అద్దెకు ఇచ్చి.. లోపల ఏం జరుగుతుందో తమకు తెలియదని చేతులు దులుపుకునే యజమానుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆస్తిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడి స్థానికులు కోరుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికైన ఫాంహౌస్‌లను శాశ్వతంగా సీజ్ చేయడమే దీనికి సరైన పరిష్కారమని స్పష్టం చేస్తున్నారు.

Next Story