ఇంటింటి చెత్త సేకరణ కోసం జీహెచ్ఎంసీపై రాంకీ ఒత్తిడి

by Malleboina Mahesh |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ, విభజన నేపథ్యంలో రాంకీ చెత్త నిర్వహణ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది.

ఇంటింటి చెత్త సేకరణ కోసం జీహెచ్ఎంసీపై రాంకీ ఒత్తిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ, విభజన నేపథ్యంలో రాంకీ చెత్త నిర్వహణ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ, రాంకీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీని భవిష్యత్‌లో విస్తరించిన ప్రాంతాల్లోనూ (60 కిలోమటర్ల వరకు) రాంకీ ఆధ్వర్యంలోనే పారిశుధ్య నిర్వహణ ఉండేలా నిబంధన పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. చెత్త సేకరణ, రవాణా, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థ తో 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. డంపింగ్ యార్డు నిర్వహణ, సైంటిఫిక్ డిస్పోజల్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి.

ఇంటింటి చెత్త సేకరణ మినహాయిస్తే జీహెచ్ఎంసీతో రాంకీ కుదుర్చుకున్న ఒప్పందం అమలవుతోంది. 2009లో ఒప్పందం ప్రకారం మెట్రిక్ టన్నుకు రూ.1800 చెల్లించాలని నిర్ణయించారు. అయితే మొదటిలో డంపింగ్ యార్డు, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం ఫీజు మాత్రమే ఇచ్చేవారు. కానీ క్రమంగా చెత్త రవాణా 20 శాతం, డంపింగ్ యార్డులో చెత్త నిల్వ, శాస్త్రీయ విధానంలో నిర్వహణకు 40 శాతం, రోడ్లపై ఉన్న చెత్తను సైతం తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి 30 శాతం మొత్తం 90 శాతం రాంకీ చేతికి వెళ్లిపోయింది. ప్రస్తుతం 100 శాతం చెత్త నిర్వహణకు మెట్రిక్ టన్నుకు రూ.2,345 ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాంకీ ద్వారా 90 శాతం కార్యక్రమాలను చేస్తుండడంతో మెట్రిక్ టన్నుకు రూ.2,110 చెల్లిస్తున్నారు.

ప్రతిరోజూ రూ.1.90 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజూ 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అయితే 27 యూఎల్బీలను విలీనం చేయడంతో 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో చెత్త ఉత్పత్తి 9 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. చెత్త రవాణా 20 శాతం, రోడ్లు, జీవీపీ పాయింట్లలోని చెత్త రవాణాకు 30 శాతం, డంపింగ్ యార్డు నిర్వహణ, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం కార్యక్రమాలను రాంకీ సంస్థనే నిర్వహిస్తోంది. ఈ మెట్రిక్ టన్నుకు రూ.2,345లో రాంకీ సంస్థకు రూ.2,110 చెల్లించాలి. అంటే ప్రతిరోజు 9 వేల మెట్రిక్ టన్నులకు సుమారు రూ.1.90 కోట్లు అవుతుంది. నెలకు రూ.57 కోట్లు, ఏడాదికి రూ.684 కోట్లు అవుతోందని ఓ అధికారి తెలిపారు.

కొత్త కార్పొరేషన్లు సైతం

ఫిబ్రవరి 10వ తేదీన జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే మూడు కార్పొరేషన్లకు విభజన కార్యక్రమం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త నిర్వహణకు పరిమితమైన రాంకీ సంస్థ కొత్తగా ఏర్పడే జీసీఎంసీ, జీఎంఎంసీలను సైతం దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. 2009లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం విస్తరణ ప్రాంతాలను అప్పగించాలని ఉందని, కొత్తగా ఏర్పడే మున్సిపల్ కార్పొరేషన్లను ఇవ్వాలనే నిబంధన లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టలేని రాంకీ సంస్థ 2053 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలా చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

ఇంటింటి చెత్త సేకరణ ఇస్తే..

గ్రేటర్ పరిధిలోని 300 వార్డుల్లో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలను జీహెచ్ఎంసీనే నిర్వహిస్తోంది. దీనికి కోసం సుమారు 5 వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లు పనిచేస్తున్నాయి. ఒక్కో టిప్పర్ ద్వారా ముగ్గురు కార్మికులు మొత్తం 15 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడం తో పాటు ఇంటికి రూ.100 చొప్పున.. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా తీసుకుంటున్నారు. ఈ ఇంటింటి చెత్త సేకరణను తమకు అప్పగించాలని రాంకీ సంస్థ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని రాంకీకి అప్పగిస్తే కార్మికులు రోడ్డున పడే అవకాశముంది.

పారిశుధ్య నిర్వహణపై హైలెవల్ కమిటీ




Next Story