- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేడీకి ఉహించని షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్
సరైన గుర్తింపు దక్కడం లేదని బీజేడీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేడీ పార్టీ (BJD party)కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ (Debashish Samantaray) తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను మే 25, 2026 నాటి తేదీతో బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు. పార్టీలో తనను చిన్నచూపు చూస్తున్నారని, ప్రస్తుతం పార్టీకి తన సేవల అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించినందుకు, ఉమ్మడి కటక్ జిల్లాతో పాటు ఒడిశా ప్రజలకు జాతీయ స్థాయిలో సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నవీన్ పట్నాయక్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎల్లప్పుడూ నిబద్ధతతో పనిచేశానని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తానే స్వయంగా పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంతరాయ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతో కష్టమైనప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా బీజేడీ పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ, సీనియర్ నేతలకు ప్రాధాన్యత తగ్గడంపై అసంతృప్తితో ఉన్న సమంతరాయ్.. చివరకు రాజీనామా బాట పట్టడం ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.






