"కుక్కల కంటే పిల్లులే నయం.. వాటినే పెంచుకోండి": సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 08:14:54  IST  )

దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, వాటి నియంత్రణ పై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.

కుక్కల కంటే పిల్లులే నయం.. వాటినే పెంచుకోండి: సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల దాడులు (Stray dog ​​attacks,), వాటి నియంత్రణ పై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో.. "కుక్కలను పెంచుకునే బదులు పిల్లులను పెంచుకోండి, కనీసం అవి ఎవరిపై దాడి చేయవు కదా" అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వాళ్ళు (Dog Lovers), వాటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజల మధ్య జరుగుతున్న వాదనలను వింటున్న క్రమంలో న్యాయమూర్తులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతుండటం, రేబిస్ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉండటం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జంతువుల పట్ల ప్రేమ ఉండాల్సిందేనని, అయితే అది మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం, వీధి కుక్కల బెడద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తదుపరి విచారణలో స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ "పిల్లుల పెంపకం" వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

కాగా ఇదే పిటీషన్లపై నిన్నటి విచారణలో.. వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కరుస్తాయో, వాటి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలుస్తుందని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధికుక్కల్ని షెల్టర్ హోమ్స్ కు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కుక్కల మూడ్ ను ఎవరూ అర్థం చేసుకోలేరని పేర్కొంది. పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తన వాదనలు వినిపించారు. వీధులలో తిరిగే కుక్కలు కరుస్తాయని భావించినపుడు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వాళ్లు కుక్కను తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి వదిలిపెడతారని తెలిపారు.

ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. స్టెరిలైజ్ చేశాక మనుషుల్ని కరవకుండా ఉండేందుకు కుక్కలకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించింది. మనుషులను కరవడం మాత్రమే కాకుండా వీధుల్లో కుక్కలు పరిగెత్తడం వల్ల వెహికల్ యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ప్రమాదం జరిగాక ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే.. ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడటం మంచిదని అభిప్రాయపడింది. అసలు వీధుల్లో, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు సమీపంలో కుక్కలు ఉండాల్సిన అవసరం ఏంటని పిటిషనర్లను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

Next Story