- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రఘురామ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
రఘురామ కస్టడీ టార్చర్ కేసు: ఏపీ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు సీసీఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్. సాయంత్రం వరకు ప్రశ్నల పరంపర.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Raghuramakrishnam Raju custodial torture case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో భాగంగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ (IPS officer Sunil Kumar Nayak) గురువారం గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ఆయన విచారణాధికారి ముందు హాజరు కాగా, సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో సీఐడీ డీఐజీ (CID DIG)గా పనిచేసిన సమయంలో రఘురామను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణకు సహకరించాలని, మార్చి 5లోపు హాజరుకావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన నేడు అధికారుల ముందుకు వచ్చారు. గత నెలలో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసుల బృందం పాట్నాకు వెళ్లింది.
ఫిబ్రవరి 23న తెల్లవారుజామున ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నప్పటికీ, స్థానిక కోర్టులో ఏపీ పోలీసులకు చుక్కెదురైంది. ట్రాన్సిట్ రిమాండ్ కోసం పోలీసులు చేసిన దరఖాస్తును పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. అరెస్ట్ వారెంట్ లేకపోవడం, కేస్ డైరీని సమర్పించక పోవడం వంటి ప్రక్రియాపరమైన లోపాలను (Procedural Lapses) ఎత్తిచూపుతూ కోర్టు సునీల్ నాయక్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఏపీ పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పాట్నా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన అనంతరం సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు
. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూనే విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా రోజువారీగా అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే సునీల్ నాయక్ నేడు గుంటూరు పోలీసుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇస్తున్నారు. రఘురామను హైదరాబాద్ నుండి మంగళగిరి తరలించడంలో మాత్రమే తన పాత్ర ఉందని, కస్టడీలో చిత్రహింసలతో తనకు సంబంధం లేదని ఆయన తన వాదనగా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.






