అమరావతిలో R-5 జోన్ రద్దు.. 900 ఎకరాల భూమి తిరిగి సీఆర్‌డీఏ పరం

by Malleboina Mahesh |

అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ సీఆర్‌డీఏ నిర్ణయం! 900 ఎకరాల భూమి తిరిగి స్వాధీనం. లబ్ధిదారులకు వేరే చోట స్థలాల కేటాయింపు.

అమరావతిలో R-5 జోన్ రద్దు.. 900 ఎకరాల భూమి తిరిగి సీఆర్‌డీఏ పరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన R-5 జోన్‌ (R-5 Zone)ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలో ఉన్న సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు అప్పగించాలని అధికారులు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూముల్లో వేసిన లేఅవుట్లు, ఇళ్ల స్థలాల పంపిణీని కూడా సీఆర్‌డీఏ అధికారికంగా రద్దు చేసింది. R-5 జోన్ వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్‌ (Amaravati Master Plan)కు తీవ్ర ఆటంకం కలుగుతుందని, రాజధాని అభివృద్ధికి ఇది అవరోధంగా మారుతుందని భావించిన యంత్రాంగం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

రాజధాని మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం భూ వినియోగాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో R-5 జోన్ కింద ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ జోన్‌లో స్థలాలు కేటాయించిన వారికి రాజధాని వెలుపల - ఇతర అనువైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాజెక్టు తన పాత రూపానికి చేరుకోనుండగా, ఇటు రాజధాని రైతులు అప్పట్లో ఈ జోన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఫలితం లభించినట్లయింది.

Next Story