పాకిస్తాన్ వెళ్లిన పంజాబ్ మహిళ.. వివాహమా? గూఢచర్యమా?

by Muthe.Rajitha |

భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన ఓ పంజాబీ సిక్కు మహిళను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్ వెళ్లిన పంజాబ్ మహిళ.. వివాహమా? గూఢచర్యమా?
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన ఓ పంజాబీ సిక్కు మహిళను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్‌లో గురునానక్ జయంతి సందర్భంగా భారత్‌ నుంచి సుమారు 2 వేల మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్‌కు వెళ్లగా, అందులో 48 ఏళ్ల సరబ్‌జిత్ కౌర్ కూడా ఉన్నారు. అయితే యాత్ర పూర్తయ్యాక మిగతా యాత్రికులంతా భారత్‌కు తిరిగి వచ్చినా.. సరబ్‌జిత్ కౌర్ మాత్రం షేక్‌పురా జిల్లాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడే ఉండి పోయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ లో తప్పిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అయితే ఆమె భారత మహిళ అని గుర్తించిన పోలీసులు గూఢచారి అనే అనుమానంతో పలుమార్లు వారి ఇంట్లో సోదాలు చేపట్టి, విచారించారు. దీంతో తమను పోలీసులు వేధిస్తున్నారని సరబ్‌జిత్ కౌర్, నాసిర్ హుస్సేన్ ఇద్దరూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించగా.. స్పందించిన కోర్టు, వారిని వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా సరబ్‌జిత్ కౌర్ మాత్రం తాను పాక్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని.. అప్పటివరకు తన వీసాను పొడిగించమని ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీని కోరారు.

తాను గత తొమ్మిదేళ్లుగా నాసిర్ హుస్సేన్‌ను ప్రేమిస్తున్నానని, భర్తతో విడాకులు తీసుకొని, నాసిర్ ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే పాకిస్థాన్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఇదే సమయంలో సరబ్‌జిత్ కౌర్‌ను స్వదేశానికి పంపించాలని పాకిస్థాన్ అధికారులు ప్రయత్నించినా, వాఘా–అటారి సరిహద్దు మూసివేయడంతో అది సాధ్యపడలేదు. దీంతో తాజాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం రెండు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Next Story