- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో కబ్జాదారుల పరం అవుతున్న ప్రజా ఆస్తులు
ఆర్మూర్ మున్సిపాలిటీలో 10% ప్రభుత్వ స్థలాల కబ్జాపై ప్రజల ఆగ్రహం. విచారణ జరిపి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్, టీపీఓ హామీ ఇచ్చారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్ మోర్ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి చెందిన 10 శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా అమ్ముకుంటున్న, మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకవర్గ హయాంలోనే అధికారుల కనుసన్నల్లో భారీగా ఆమ్యామ్యాలు చేతులు మారి, ఈ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆర్మూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీజేపీ నాయకులు పలుమార్లు ధర్నాలు చేసి అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ, ఆయా స్థలాల్లో నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతుండటం గమనార్హం.
అక్రమ పట్టాల మాయాజాలం!
ముఖ్యంగా రాజారాంనగర్‌లోని 28వ వార్డులో మున్సిపాలిటీకి చెందిన 10శాతం స్థలాన్ని ఓ వ్యక్తి తప్పుడు పత్రాలతో కబ్జా చేస్తున్నాడని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక లాయర్ సాయంతో తప్పుడు డిగ్రీ పొంది, మున్సిపల్ కార్యాలయం నుండి అక్రమంగా ఇంటి నెంబర్ సంపాదించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. గత మూడు సంవత్సరాలుగా కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, నిర్మాణ పనులు ఆగక పోవడం వెనుక 'పెద్దల' హస్తం ఉన్నట్లు కాలనీవాసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి ఆ స్థలాన్ని మరొకరికి విక్రయించాడని, టౌన్ ప్లానింగ్ అధికారుల మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదని స్థానికులు మండిపడుతున్నారు.
గుర్తించడంలో అధికారుల విఫలం.. లెక్కలు తేల్చాలని డిమాండ్
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఎన్ని వెంచర్లు ఉన్నాయి? విలీనానికి ముందు ఎన్ని లేఅవుట్లు ఉండేవి? అనే పూర్తిస్థాయి లెక్కలు తీయడంలో అధికారులు విఫలమయ్యారు. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో 5 శాతంగా ఉన్న కేటాయింపులు, ప్రస్తుతం 10 శాతానికి పెరిగాయి. 36 వార్డుల వారీగా వెంచర్లను గుర్తించి, 10% స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తే కబ్జాలు ఇట్టే బయటపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎమ్మెల్యే హయాంలో కుల సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు స్థలాలు కేటాయించిన అదును చూసి, అధికారులు తమ అనుచరులకు ప్రజా ఆస్తులను కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మున్సిపల్ ఆస్తులను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కబ్జా కాకుండా చూస్తా..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురికాకుండా చూస్తా. మున్సిపల్ పరిధిలోని వెంచర్లలో మున్సిపల్ 10 శాతం స్థలాలను గుర్తించి వాటికి హద్దులు తీయిస్తాం. ఇక ముందట జరగబోయే వెంచర్లలో మున్సిపల్ 10 శాతం స్థలాలను కచ్చితంగా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు తీసుకుంటా. ఇదివరకు చేసిన వెంచర్లలో ఏర్పాట్లు ఎంతవరకు చేశారు?, ఆ వెంచర్లలోని ప్లాట్ల వివరాలు తెలుసుకొని ఏర్పాట్లు చేయని ఏరియాల్లో ఏర్పాట్లు చేసేలా చూస్తా. - గోనె లహరి రఘు, మున్సిపల్ చైర్‌పర్సన్, ఆర్మూర్
మున్సిపాలిటీలో 10 శాతం స్థలాలను గుర్తిస్తాం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల వెంచర్ల లోని మున్సిపల్ 10% స్థలాలను మున్సిపల్ అసిస్టెంట్ టిపిఓలతో సర్వే చేయించి పక్కాగా గుర్తిస్తాం. సర్వేలో కబ్జాకు గురైనట్లు తెలిస్తే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. - ఆంజనేయులు, టీపీఓ, ఆర్మూర్






