NMC: మెడికల్ పీజీ సీట్ల తాత్కాలిక జాబితా విడుదల

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలలు మరియు సంస్థలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను అందుబాటులో ఉన్న పోస్ట్-గ్రాడ్యుయేట్ సీట్ల తాత్కాలిక వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది.

NMC: మెడికల్ పీజీ సీట్ల తాత్కాలిక జాబితా విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలలు మరియు సంస్థలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను అందుబాటులో ఉన్న పోస్ట్-గ్రాడ్యుయేట్ సీట్ల తాత్కాలిక వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) ద్వారా జనవరి 30, 2026 నాటికి మంజూరైన సీట్ల వివరాలను వెల్లడించారు. వైద్య కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఇతర భాగస్వామ్య పక్షాలు తమ సంస్థలకు కేటాయించిన సీట్ల సంఖ్యను నిశితంగా పరిశీలించాలని ఎన్ఎంసీ సూచించింది. సీట్ల సంఖ్యలో ఏవైనా వ్యత్యాసాలు లేదా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే, తగిన ఆధారాలతో ఈ నోటీసు వెలువడిన 15 రోజుల్లోపు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా [email protected] అనే ఈమెయిల్ ఐడిని కేటాయించింది. నిర్ణీత గడువులోగా వ్యత్యాసాలను నివేదించడంలో విఫలమైతే, ఎన్ఎంసీ అడ్మిషన్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని కమిషన్ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని క్లినికల్ మరియు నాన్-క్లినికల్ విభాగాల వారీగా సీట్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాల కోసం, కళాశాలల వారీగా సీట్ల జాబితా కొరకు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Next Story