ప్రధాని నివాసం ముందు నిరసనలు దుర్మార్గం

by Ratna Kumari |   (  Updated:2026-07-24 10:36:42  IST  )

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా టేకుమట్ల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ప్రధాని నివాసం ముందు నిరసనలు దుర్మార్గం
X

దిశ, టేకుమట్ల : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా టేకుమట్ల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రపు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నివాసం ముందు నిరసనలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్య అని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థుల పేరుతో జరిగిన 'చలో పార్లమెంట్' కార్యక్రమంలో అరాచక శక్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని హింసాత్మకంగా మార్చాయని ఆరోపించారు. అలాంటి ఘటనలకు మద్దతు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అరాచక శక్తులను సమర్థిస్తున్నట్లుగా వ్యవహరిస్తూ ప్రధాని, కేంద్ర మంత్రుల నివాసాల వద్ద ఆందోళనలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో అనుచిత సంప్రదాయానికి నాంది పలికినట్లేనని విమర్శించారు. ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పలు పేపర్ లీక్ ఘటనలు జరిగినప్పటికీ ఏ మంత్రి రాజీనామా చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలోనే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించిందని, పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకుని అరెస్టులు కూడా జరిగాయని పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నిరసనల పేరుతో అరాచక పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, మండల ఇన్‌చార్జి మోరే రవీందర్ రెడ్డి, జిల్లా నాయకుడు కూర సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య, సర్పంచ్ బొడ్డు రాజేందర్, దాగు రఘు, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Next Story